
India-USA: వాణిజ్య చర్చలు ప్రారంభించిన న్యూఢిల్లీ, అమెరికా..'భారతదేశం సుంకాలను తగ్గిస్తుంది':ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ పలు వస్తువులపై సుంకాలను తగ్గించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
కొన్ని కేటగిరీల ఉత్పత్తులపై భారత్ సుంకాల తగ్గింపునకు సిద్ధమవుతోందన్న సమాచారం తనకు అందిందని ఆయన తెలిపారు.
ఈ విషయాన్ని ఆయన ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పారు. అయితే ఎలాంటి ఉత్పత్తులపై సుంకం తగ్గించనున్నదీ స్పష్టంగా వివరించలేదు.
భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bi-lateral Trade Agreement - BTA) నేపథ్యంలో,ఇరు దేశాల అధికారులూ ఈ నెల 23న వాషింగ్టన్‌లో చర్చలు ప్రారంభించారు.
ఈ ఒప్పందం ద్వారా అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో కొత్త మార్కెట్లు సిద్ధమవుతాయని అమెరికా ఇప్పటికే ప్రకటించింది.
వివరాలు
అమెరికా 90 రోజుల పాటు టారిఫ్ అమలు నిలిపివేత
దీంతో పాటు, ఇరు దేశాల్లోని ఉద్యోగులకు, రైతులకు,అలాగే స్టార్టప్ పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు లభిస్తాయని పేర్కొంది.
అమెరికా తరఫున టారిఫ్‌లు, టారిఫేతర అడ్డంకులను తగ్గించాలనే అభిప్రాయాన్ని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ వ్యక్తం చేశారు.
ఈ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన షరతులను (Terms of References) భారత్, అమెరికా సంయుక్తంగా తుదిరూపంలోకి తీసుకువచ్చాయి.
కాగా, అమెరికా 90 రోజుల పాటు టారిఫ్ అమలును నిలిపివేయడంతో ఈ మూడు రోజుల చర్చలకు మరింత ప్రాధాన్యం లభించింది.
ఈ చర్చల కోసం భారత్ తరఫున వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ నేతృత్వం వహిస్తున్నారు.
వివరాలు
అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా ప్రయత్నాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లపై అనేక దేశాలు ప్రతీకార చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, భారత్ మాత్రం వేరే దారిని ఎంచుకుంది.
ప్రతిస్పందన చర్యలకు బదులుగా, అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి తొలి అడుగులు వేసిన సంగతి విదితమే.
పరస్పర ప్రయోజనాల దృష్ట్యా ఈ ఒప్పందాన్ని ఏర్పాటు చేయాలని ఇరుదేశాధినేతలు ఒకే అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి.