Page Loader
US: మోసపూరిత కాల్స్‌పై.. అమెరికాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక హెచ్చరిక 

US: మోసపూరిత కాల్స్‌పై.. అమెరికాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక హెచ్చరిక 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2025
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ఒక కీలక అడ్వైజరీ విడుదల చేసింది. భారత రాయబార కార్యాలయం పేరుతో నకిలీ కాల్స్‌ (Fraud Calls) పెరుగుతున్న నేపథ్యంలో, భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం, క్రెడిట్‌ కార్డు వివరాలు ఇతరుల‌కు అందించవద్దని హెచ్చరించింది. పాస్‌పోర్ట్, ఇమిగ్రేషన్ ఫారమ్‌, వీసాలో లోపాలున్నాయని నమ్మించేందుకు సైబర్ మోసగాళ్లు ప్రయత్నిస్తూ, డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వివరించింది. ఈ లోపాలను సరిచేసేందుకు చెల్లింపులు చేయాలని ఒత్తిడి చేస్తూ, లేకుంటే అమెరికా నిబంధనల ప్రకారం భారత్‌కు తిరిగి పంపిస్తామని లేదా జైలు శిక్ష విధిస్తామని బెదిరిస్తున్నారని పేర్కొంది.

వివరాలు 

భారతీయులు అప్రమత్తంగా ఉండాలి 

ఇలాంటి నకిలీ కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా వెంటనే భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించాలని సూచించింది. అంతేకాకుండా, అమెరికాలో ఉన్న భారతీయ పౌరులతో పాటు, వీసా దరఖాస్తుదారులకు కూడా ఇలాంటి మోసపూరిత కాల్స్ వచ్చినట్లు ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. భారత రాయబార కార్యాలయ అధికారులు ఎవరూ వ్యక్తిగత వివరాలను ఫోన్ ద్వారా అడగరని, అధికారికంగా కేవలం "@mea.gov.in" మెయిల్ ద్వారా మాత్రమే సంప్రదిస్తారని స్పష్టం చేసింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని మరోసారి హెచ్చరించింది.

వివరాలు 

అమెరికాలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మొదటి నుంచీ అక్రమ వలసదారుల (Illegal Migrants) పై కఠిన వైఖరి పాటిస్తున్నారు. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం, ఈ విధానాన్ని మరింత కఠినతరం చేశారు. ఈ క్రమంలో, అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన లేదా సరైన పత్రాలు లేని భారతీయులతో పాటు, ఇతర దేశీయులను కూడా అమెరికా సైనిక విమానాల ద్వారా వెనక్కి పంపినట్లు సమాచారం.