LOADING...
Jagdeep Singh Arrest: అమెరికాలో పట్టుబడ్డ ఇండియన్ గ్యాంగ్‌స్టర్
అమెరికాలో పట్టుబడ్డ ఇండియన్ గ్యాంగ్‌స్టర్

Jagdeep Singh Arrest: అమెరికాలో పట్టుబడ్డ ఇండియన్ గ్యాంగ్‌స్టర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2025
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో భారతీయ గ్యాంగ్‌స్టర్‌ జగ్గా అరెస్ట్ అయ్యాడు. రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో అనేక క్రిమినల్‌ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న జగ్దీప్‌ సింగ్‌ అలియాస్‌ జగ్గాను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు సన్నిహితుడు కాగా, ప్రస్తుతం రోహిత్‌ గోదారా నెట్‌వర్క్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. అమెరికా-కెనడా సరిహద్దు ప్రాంతంలో జగ్గాను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన్ని భారత్‌కు అప్పగించే ప్రక్రియ చట్టపరంగా ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, రాజస్థాన్‌ పోలీసుల యాంటీ గ్యాంగ్‌స్టర్‌ టాస్క్‌ఫోర్స్‌ (AGTF) అనేక దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకుని ఈ ఆపరేషన్‌ చేపట్టింది.

Details

పోలీసుల అదుపులో జగ్గా

విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జగ్గాపై AGTF గూఢచర్య సమాచారం సేకరించి, అమెరికా అధికారులకు అందజేసింది. దాని ఆధారంగా అమెరికా పోలీసులు కచ్చితమైన ప్రణాళికతో జగ్గాను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను భారత్‌కు అప్పగించేందుకు అవసరమైన దౌత్యపరమైన చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లా ధురోకోట్‌ గ్రామానికి చెందిన జగ్గా, గత కొన్ని ఏళ్లుగా విదేశాల నుంచి నేర కార్యకలాపాలను నియంత్రిస్తున్నాడు. భారత్‌లో దోపిడీలు, కాంట్రాక్ట్‌ హత్యలు చేయడానికి కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లు, విదేశీ సహచరులను ఉపయోగించుకునేవాడని నిఘా వర్గాలు వెల్లడించాయి.

Details

పలు అరెస్టు వారెంట్లు జారీ

భారత నిఘా సంస్థల నుంచి తప్పించుకోవడానికి తరచూ దేశాలు మారుస్తూ ఉండేవాడని తెలిపారు. AGTF అధికారి దినేష్‌ ఎం.ఎన్. మాట్లాడుతూ, జగ్గాపై రాజస్థాన్‌ కోర్టులు ఇప్పటికే పలు అరెస్ట్‌ వారెంట్లు జారీ చేశాయి. ఆ వారెంట్లను ఆధారంగా తీసుకుని, అంతర్జాతీయ నిఘా సంస్థల సహకారంతో అతడిని గుర్తించి అరెస్ట్‌ చేశాం. అమెరికా అధికారులు కెనడా సరిహద్దు సమీపంలో జగ్గాను పర్యవేక్షించి, అప్రయత్నంగా అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం జగ్గా అమెరికా కస్టడీలోనే ఉన్నాడని, భారత ప్రభుత్వం ఆయనపై ఇప్పటికే రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసిందని వెల్లడించారు. ఈ అరెస్ట్‌ భారత్‌-అమెరికా మధ్య నేర నిరోధక సహకారానికి కీలక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.