Loading...
Canada: కెనడాలో భారత యువకుడి దారుణ హత్య.. కారులో కాలిన మృతదేహం గుర్తింపు
కెనడాలో భారత యువకుడి దారుణ హత్య.. కారులో కాలిన మృతదేహం గుర్తింపు

Canada: కెనడాలో భారత యువకుడి దారుణ హత్య.. కారులో కాలిన మృతదేహం గుర్తింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలో మరో భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బ్రిటిష్ కొలంబియాలోని లాంగ్లీ ప్రాంతంలో ఓ కారులో కాలిన స్థితిలో అతడి మృతదేహం బయటపడటం కలకలం రేపింది. మృతుడిని 25ఏళ్ల భారతీయ యువకుడు తుషార్ శర్మగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కెనడా హోమిసైడ్ దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 29వ తేదీ రాత్రి 10:30గంటల సమయంలో రావ్లిన్సన్ క్రెసెంట్ ప్రాంతంలో ఓ వాహనం మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అనంతరం కారులో మానవ అవశేషాలను గుర్తించారు. విచారణ చేపట్టిన అధికారులు మృతుడు సర్రే ప్రాంతానికి చెందిన తుషార్ శర్మగా నిర్ధారించారు.

వివరాలు 

దర్యాప్తు చేపట్టిన ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్

ఈ ఘటనను అనుమానాస్పద హత్యగా భావించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కెనడా ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్(IHIT) విచారణ బాధ్యతలను స్వీకరించింది.

స్థానిక పోలీసుల సహకారంతో ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు.

హత్యకు సంబంధించిన పరిస్థితులు,నిందితుల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రాథమిక విచారణలో తుషార్ శర్మకు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని,కెనడాలోనూ అతడికి ఎక్కువ పరిచయాలు లేవని పోలీసులు గుర్తించారు.

అయినప్పటికీ ఈ హత్య యాదృచ్ఛికంగా జరిగినది కాకుండా,తుషార్‌ను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడి అయి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

అయితే ఈ హత్యకు గల కారణాలు, దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

వివరాలు 

కుటుంబ సభ్యులు,స్నేహితుల విచారణ 

హత్యకు ముందు తుషార్ శర్మ ఎక్కడికి వెళ్లాడు?ఎవరిని కలిశాడు?అతడి రోజువారీ కార్యకలాపాలు ఎలా ఉండేవి? అనే వివరాలను సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇందులో భాగంగా కుటుంబ సభ్యులు,స్నేహితులను విచారిస్తున్నారు.

విదేశాల్లో నివసిస్తున్న అతడి బంధువులను సైతం సంప్రదించి మరింత సమాచారం తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు.

మరోవైపు,ఈ ఘటనకు సంబంధించి ఏవైనా కీలక ఆధారాలు లభిస్తాయన్న ఆశతో పోలీసులు స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అక్టోబర్ 29వ తేదీ రాత్రి రావ్లిన్సన్ క్రెసెంట్ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులను లేదా కార్యకలాపాలను గమనించినా, ఘటనకు సంబంధించిన సీసీటీవీ లేదా డాష్‌క్యామ్ వీడియోలు అందుబాటులో ఉన్నా తమకు సమాచారం అందించాలని కోరారు.

ఈ హత్య వెనుక అసలు కారణాలు, నిందితుల వివరాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

ADVERTISEMENT