LOADING...
Tarun Bali: కెనడాలో విషాదం.. డ్యూటీలోనే ప్రాణాలు కోల్పోయిన భారత సంతతి పోలీస్ అధికారి
కెనడాలో విషాదం.. డ్యూటీలోనే ప్రాణాలు కోల్పోయిన భారత సంతతి పోలీస్ అధికారి

Tarun Bali: కెనడాలో విషాదం.. డ్యూటీలోనే ప్రాణాలు కోల్పోయిన భారత సంతతి పోలీస్ అధికారి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2026
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలో భారత సంతతికి చెందిన పోలీస్ అధికారి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒంటారియో ప్రావిన్షియల్ పోలీస్ (ఓపీపీ) విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తరుణ్ బాలి మంగళవారం ఓ కేసు దర్యాప్తు సందర్భంగా తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒంటారియోలోని హియర్స్ట్ సమీపంలో కెండల్ కన్సెషన్ రోడ్-7, కన్సెషన్ రోడ్-6 ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కేసు దర్యాప్తు నిర్వహిస్తున్న సమయంలో తరుణ్ బాలి తీవ్రంగా గాయపడగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

వివరాలు 

పోస్టుమార్టం కోసం టొరంటోలోని చీఫ్ కరోనర్ కార్యాలయానికి తరుణ్ బాలి మృతదేహం 

తరుణ్ బాలి రెండున్నరేళ్లుగా ఒంటారియో ప్రావిన్షియల్ పోలీస్ శాఖలో సేవలందిస్తున్నారు. డఫెరిన్ డిటాచ్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన, ప్రత్యేక బాధ్యతల్లో భాగంగా జేమ్స్ బే డిటాచ్‌మెంట్ సిబ్బందితో కలిసి హియర్స్ట్ ప్రాంతానికి వెళ్లారు. ఆయన మృతిని ఓపీపీ కమిషనర్ థామస్ కారిక్ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. ప్రజల భద్రత కోసం తరుణ్ బాలి చూపిన ధైర్యసాహసాలు, అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులు,సహచర పోలీసులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై ఒంటారియో ప్రావిన్షియల్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్, చీఫ్ కరోనర్ కార్యాలయం, ఒంటారియో ఫోరెన్సిక్ పాథాలజీ సర్వీస్ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. పోస్టుమార్టం కోసం తరుణ్ బాలి మృతదేహాన్ని టొరంటోలోని చీఫ్ కరోనర్ కార్యాలయానికి తరలించనున్నారు.

వివరాలు 

బాలి మృతి పట్ల కెనడా పోలీస్ సంఘాలు సంతాపం

హియర్స్ట్ నుంచి టొరంటో వరకు సుమారు 10 గంటల ప్రయాణంలో అత్యవసర వాహనాల కాన్వాయ్ ఆయన భౌతికకాయానికి గౌరవ వందనం తెలుపుతూ వెంట సాగనుంది. తరుణ్ బాలి మృతిపై కెనడా వ్యాప్తంగా పోలీస్ సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ప్రజల రక్షణ కోసం విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది ప్రతిరోజూ ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటారో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోందని ఓపీపీ అసోసియేషన్ అధ్యక్షుడు డేవిడ్ సబాటిని ఆవేదన వ్యక్తం చేశారు. కెనడియన్ పోలీస్ అసోసియేషన్ కూడా బాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసి ఉంటే తమను లేదా క్రైమ్ స్టాపర్స్‌ను సంప్రదించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement