Loading...
US citizenship: అమెరికాలో సంచలనం.. 40 మంది పౌరసత్వం రద్దుకు న్యాయశాఖ చర్యలు
అమెరికాలో సంచలనం.. 40 మంది పౌరసత్వం రద్దుకు న్యాయశాఖ చర్యలు

US citizenship: అమెరికాలో సంచలనం.. 40 మంది పౌరసత్వం రద్దుకు న్యాయశాఖ చర్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో పౌరసత్వం రద్దు చేసే ప్రక్రియను ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది సహజీకృత అమెరికా పౌరులపై పౌరసత్వ రద్దు (Denaturalization) చర్యలను న్యాయశాఖ ప్రారంభించింది. ఆగస్టు 21 నుంచి అక్టోబర్ 2, 2026 మధ్య ఈ కేసులకు సంబంధించిన పిటిషన్లు దాఖలయ్యాయి. ట్రంప్‌ ప్రభుత్వం హయాంలో ఒకే వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో పౌరసత్వ రద్దు కేసులు దాఖలు కావడం ఇదే తొలిసారి అని అమెరికా న్యాయశాఖ తెలిపింది. ఈ 40 మందిపై విదేశీ ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేయడం,స్వచ్ఛంద హత్యకు పాల్పడటం,ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తిపై తీవ్రమైన లైంగిక దాడికి పాల్పడటం వంటి పలు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

వివరాలు 

పౌరసత్వం ఎప్పుడు రద్దు చేయొచ్చు?

వీరికి సంబంధించిన కేసులు అమెరికాలోని వివిధ ఫెడరల్‌ జిల్లా కోర్టుల్లో కొనసాగుతున్నాయి.

అయితే, న్యాయశాఖ దాఖలు చేసిన ఫిర్యాదుల్లోని ఆరోపణలు మాత్రమే ఇవని, కోర్టులు ఇంకా తుది బాధ్యతను నిర్ధారించలేదని అధికారులు స్పష్టం చేశారు.

అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ నేషనాలిటీ యాక్ట్‌ ప్రకారం.. ఒక వ్యక్తి అమెరికా పౌరసత్వాన్ని చట్టవిరుద్ధంగా పొందినట్లు తేలితే దాన్ని రద్దు చేసే అవకాశం ఉంది.

ముఖ్యమైన విషయాలను దాచిపెట్టి లేదా కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చి పౌరసత్వం పొందిన సందర్భాల్లోనూ సహజీకృత పౌరసత్వాన్ని రద్దు చేయవచ్చు.

అమెరికా అటార్నీ జనరల్‌ టాడ్‌ బ్లాంచె మాట్లాడుతూ.. సహజీకరణ ప్రక్రియలో మోసం లేదా ఇతర చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడినవారిపై చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

వివరాలు 

భారత సంతతికి చెందిన బల్వీందర్‌ సింగ్‌పై ఆరోపణలు

తాజా 40 కేసులు ఒకే వ్యవధిలో దాఖలైన కేసుల పరంగా ట్రంప్‌ ప్రభుత్వ హయాంలోనే అత్యధికమని న్యాయశాఖ పేర్కొంది.

తాజా కేసుల్లో భారత సంతతికి చెందిన బల్వీందర్‌ సింగ్‌ కూడా ఉన్నారు.

అమెరికాలోకి ప్రవేశించడం, ఇమ్మిగ్రేషన్‌ ప్రయోజనాలు పొందడం, అనంతరం పౌరసత్వం పొందే క్రమంలో తప్పుడు గుర్తింపును ఉపయోగించినట్లు ఆయనపై న్యాయశాఖ ఆరోపణలు చేసింది.

న్యాయశాఖ వివరాల ప్రకారం.. 1992లో బల్వీందర్‌ సింగ్‌ అనే పేరుతో ఇమ్మిగ్రేషన్‌ దరఖాస్తు సమర్పించారు.

అనంతరం 2003లో మరో గుర్తింపును ఉపయోగించి శాశ్వత నివాస హోదా పొందారు.

రెండు దరఖాస్తుల్లోనూ ఉపయోగించిన వేలిముద్రలు ఒకే వ్యక్తివేనని పరిశీలనలో తేలినట్లు అధికారులు తెలిపారు.

2009లో రెండో గుర్తింపుతో ఆయన అమెరికా పౌరసత్వం పొందినట్లు న్యాయశాఖ పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

చైనా వ్యక్తిపైనా పౌరసత్వ రద్దు చర్యలు

తప్పుడు వివరాలు సమర్పించడం,ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియలో వాస్తవాలను దాచడం సహా మొత్తం ఏడు ఆరోపణలను న్యాయశాఖ ఆయనపై నమోదు చేసింది.

ఈ చర్యలు ఆయన నైతిక ప్రవర్తనకు సంబంధించి ప్రతికూలంగా ప్రభావం చూపుతాయని అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదే సమయంలో చైనాకు చెందిన మరో వ్యక్తి విషయంలోనూ అమెరికాన్యాయశాఖ పౌరసత్వ రద్దు ప్రక్రియ చేపట్టింది.

2021లో అమెరికా నేవీలో చేరిన ఆ వ్యక్తి..2022నుంచి సైనిక రహస్యాలను చైనాకు విక్రయించినట్లు న్యాయశాఖ ఆరోపించింది.

అదే ఏడాది మేలో ఆయన అమెరికా పౌరసత్వం పొందినట్లు పేర్కొంది.ఈకేసులో 2025ఆగస్టులో ఆయన దోషిగా తేలినట్లు అధికారులు తెలిపారు.

అమెరికా న్యాయశాఖ తాజా చర్యల్లో పాకిస్థాన్‌,మెక్సికో,కంబోడియా,నేపాల్‌,అఫ్గానిస్థాన్‌ తదితర దేశాలకు చెందిన వ్యక్తుల పౌరసత్వ రద్దు కేసులు కూడా ఉన్నాయని వెల్లడించింది.

ADVERTISEMENT