అధ్యక్ష రేసులో మరో భారతీయుడు.. సింగపూర్లో థర్మన్ షణ్ముగరత్నం పోటీ
విదేశాల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు రాజకీయంలోనూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే రుషి సునక్ బ్రిటన్ ప్రధాని కాగా వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష బరిలో నిలుస్తున్నారు. తాజాగా సింగపూర్ అధ్యక్ష రేసులో భారతదేశానికి చెందిన థర్మన్ షణ్ముగరత్నం నిలిచారు. సింగపూర్ డిప్యూటీ ప్రధానిగా పనిచేసిన షణ్ముగరత్నం, చైనా సంతతికి చెందిన కాక్ సాంగ్, మరో అభ్యర్థి తన్ కిన్ లియాన్‌తో పోటీ పడనున్నారు. సెప్టెంబర్ 1న జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది. ఈ క్రమంలోనేే సింగపూర్ అధ్యక్ష ఎన్నికల కమిటీ మంగళవారం అధికారికంగా ప్రకటన చేసింది. మొత్తం ఆరుగురు అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పరిశీలన అనంతరం ముగ్గురు మాత్రమే పోటీ పడేందుకు అర్హత సాధించినట్లు ఎన్నికల కమిటీ వెల్లడించింది.
అభ్యర్థితత్వం ఖరారైనందుకు సంతోషంగా ఉంది : థర్మన్ షణ్ముగరత్నం
66 ఏళ్ల షణ్ముగరత్నం, 2011 నుంచి 2019 కాలంలో సింగపూర్ ఆర్థిక, విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు థర్మన్ షణ్ముగరత్నం హర్షం వ్యక్తం చేశారు. ఈ అరుదైన అవకాశం తనకు దక్కడం సంతోషంగా ఉందన్నారు. న్యాయమైన, దయతో కూడిన మంచి సమాజాన్ని మాత్రమే తాను విశ్వసిస్తున్నట్లు షణ్ముగరత్నం తెలిపారు. తన జీవితం అందుకోసం అంకితం ఇచ్చానన్నారు. మరోవైపు సింగపూర్ దేశం తనకు చాలా ప్రత్యేకమైందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత దేశ అధ్యక్షురాలు హలీమా యాకోబ్, అధ్యక్ష పదవి కాలం సెప్టెంబర్ 13తో పూర్తి కానుంది. ఆరేళ్ల పదవికి గడువు ముగియనున్న నేపథ్యంలోనే సెప్టెంబర్ 1న సింగపూర్ కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరగనున్నాయి.