H-1B rules: అమెరికా వీసాలకు మరోసారి కఠిన నిబంధనలు.. హెచ్-1బీ ఉద్యోగులు,విద్యార్థులపై ప్రభావం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో వలసలను కట్టడి చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే వలస విధానాలపై పలు ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా ప్రభుత్వం.. ఇప్పుడు ఇమిగ్రేషన్ వ్యవస్థలో మరిన్ని కఠిన నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మార్పులతో ముఖ్యంగా హెచ్-1బీ వీసా విధానం మరింత కఠినతరం కానుండగా, విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. అలాగే అంతర్జాతీయ విద్యార్థుల వీసా విధానం,హెచ్-4 వీసాదారుల ఉద్యోగ అనుమతులపై కూడా ప్రభావం చూపే మార్పులు ప్రతిపాదించారు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS), కార్మిక శాఖ విడుదల చేసిన తాజా రెగ్యులేటరీ అజెండాల్లో ఈ ప్రతిపాదిత మార్పులను పొందుపరిచినట్లు సమాచారం.
వివరాలు
మార్పులపై అధికారిక ప్రకటన చేయని అమెరికా
వీటిలో కొన్ని నిబంధనలు ఈ నెలలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కొన్ని మార్పులను తుది నిబంధనల రూపంలో ప్రకటించనుండగా, మరికొన్నింటిని ముసాయిదా ప్రతిపాదనలుగా విడుదల చేసి ప్రజల అభిప్రాయాలు స్వీకరించనున్నట్లు సమాచారం. అయితే, ఈ మార్పులపై అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఇవి అమల్లోకి వస్తే భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులు, హెచ్-4 వీసాదారులపై గణనీయమైన ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రధాన మార్పులు
ప్రస్తుతం అమెరికాలో 50 మందికిపైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలు అర్హత కలిగిన హెచ్-1బీ పిటిషన్‌కు అదనంగా 4,000 డాలర్లు, ఎల్-1 పిటిషన్‌కు 4,500 డాలర్ల ప్రత్యేక ఫీజు చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అదనపు ఫీజు తొలిసారి అమెరికాకు వచ్చే ఉద్యోగి లేదా మరో సంస్థ నుంచి మారిన ఉద్యోగిని స్పాన్సర్ చేసిన సందర్భాల్లో మాత్రమే వర్తిస్తోంది. అయితే ప్రతిపాదిత కొత్త నిబంధనల ప్రకారం హెచ్-1బీ వీసా పొడిగింపు (ఎక్స్‌టెన్షన్) పిటిషన్లకూ ఇదే అదనపు ఫీజు చెల్లించాల్సి రావచ్చు. ఈ నిబంధన జులైలోనే అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
వివరాలు
థర్డ్‌పార్టీ క్లయింట్ సైట్లపై మరింత పర్యవేక్షణ
హెచ్-1బీ ఉద్యోగులను థర్డ్‌పార్టీ క్లయింట్ లొకేషన్లలో నియమించే విధానంపై కూడా అమెరికా ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త నిబంధనల ప్రకారం క్లయింట్ సైట్‌లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగి-యజమాని మధ్య వాస్తవ సంబంధం ఉందని కంపెనీలు నిరూపించాల్సి ఉంటుంది. అదనంగా, ఆ ఉద్యోగులు పనిచేస్తున్న ప్రదేశాలు, అసైన్‌మెంట్‌లకు సంబంధించిన వివరాలను నిరంతరం ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారతీయ ఐటీ, కన్సల్టింగ్ సంస్థలు ఎక్కువగా థర్డ్‌పార్టీ క్లయింట్ లొకేషన్లలో ఉద్యోగులను నియమిస్తుండటంతో ఈ మార్పు వాటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
వివరాలు
హెచ్-1బీ వేతనాలపై కొత్త ప్రతిపాదనలు
కొత్త నిబంధనల్లో హెచ్-1బీ ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన అంశాన్నీ ప్రస్తావించారు. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాల కనీస వేతన పరిమితిని రెట్టింపు చేసే ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఇది అమల్లోకి వస్తే విదేశీ ఉద్యోగులను స్పాన్సర్ చేసే సంస్థలకు వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో హెచ్-4 వీసాదారులకు ప్రస్తుతం అమలులో ఉన్న ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్ పొడిగింపు విధానాన్ని కూడా నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
వివరాలు
విద్యార్థుల వీసా విధానంలోనూ మార్పులు
అంతర్జాతీయ విద్యార్థుల విషయంలో కూడా కీలక మార్పులు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఎఫ్-1 వీసాపై అమెరికాలో చదువుతున్న విద్యార్థులు, జే-1 వీసాపై వచ్చిన ఎక్స్ఛేంజ్ విజిటర్లకు 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' విధానం అమల్లో ఉంది. దీని ప్రకారం వారు తమ కోర్సు లేదా ఇంటర్న్‌షిప్ పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండే అవకాశం ఉంటుంది. కానీ కొత్త ప్రతిపాదనల ప్రకారం ఈ విధానాన్ని తొలగించి, నిర్ణీత కాలపరిమితితో కూడిన వీసాలను జారీ చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పు కూడా ఈ నెలలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వివరాలు
భారతీయులపై ఎంత ప్రభావం?
ప్రతి ఏడాది అమెరికా జారీ చేసే హెచ్-1బీ వీసాల్లో అత్యధిక వాటా భారతీయులకే దక్కుతోంది. కొత్త నిబంధనల కారణంగా విదేశీ ఉద్యోగుల నియామకాలు తగ్గితే భారతీయ ఐటీ నిపుణులపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం అమెరికాలో సుమారు 3.6 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. విదేశీ విద్యార్థుల మొత్తం సంఖ్యలో వీరి వాటా దాదాపు 31 శాతం. అలాగే హెచ్-4 వీసాలపై సుమారు లక్ష మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నట్లు అంచనా.
వివరాలు
అమెరికా కంపెనీలకూ సవాళ్లు
కొత్త నిబంధనల ప్రభావం కేవలం విదేశీ ఉద్యోగులపైనే కాకుండా అమెరికా కంపెనీలపైనా పడే అవకాశం ఉంది. ఇప్పటికే అమల్లో ఉన్న కఠిన వీసా నిబంధనల కారణంగా విదేశీ నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నిలబెట్టుకోవడం కంపెనీలకు సవాలుగా మారింది. 'ఎన్వాయ్ గ్లోబల్' అనే ఇమిగ్రేషన్ సేవల సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. గత ఏడాదిలో అమెరికాలోని దాదాపు 65 శాతం కంపెనీలు కనీసం ఒక్క విదేశీ ఉద్యోగినైనా కోల్పోయాయి. వీసా ప్రాసెసింగ్‌లో జాప్యం, కఠిన పరిశీలన, పెరుగుతున్న నిబంధనల కారణంగా విదేశీ నిపుణులను త్వరగా నియమించుకోవడం కష్టమవుతోందని సంస్థలు వెల్లడించాయి.