South Africa: దక్షిణాఫ్రికా వెళ్లే భారతీయులకు శుభవార్త.. 48 గంటల్లోనే డిజిటల్ వీసా
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికాలో సఫారీలో సింహాలను ప్రత్యక్షంగా చూడాలని, గార్డెన్ రూట్‌లో సుందరమైన డ్రైవ్‌ను ఆస్వాదించాలని లేదా కేప్‌టౌన్ నగర సోయగాలను అనుభవించాలని భావిస్తున్న భారతీయ ప్రయాణికులకు శుభవార్త. విదేశీ పర్యాటకుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశగా దక్షిణాఫ్రికా ప్రభుత్వం కొత్త ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానంతో సంప్రదాయ వీసా స్టిక్కర్ కోసం కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మొత్తం దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయవచ్చు. ముఖ్యంగా, దరఖాస్తుల పరిశీలన కేవలం 24 నుంచి 48 గంటల్లో పూర్తవడం ఈ వ్యవస్థలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
వివరాలు
ఈటీఏ అంటే ఏమిటి? ప్రయోజనాలేమిటి?
ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) అనేది పాస్‌పోర్ట్‌కు డిజిటల్ రూపంలో అనుసంధానమయ్యే ప్రయాణ అనుమతి.
దీని ద్వారా పర్యాటకం, స్వల్పకాలిక సందర్శనలు లేదా వ్యాపార అవసరాల కోసం 90 రోజుల వరకు దక్షిణాఫ్రికాలో ఉండేందుకు అనుమతి లభిస్తుంది.
ఈ అనుమతి గడువు ముగిసేలోపు ప్రయాణికులు అవసరాన్ని బట్టి ఎన్నిసార్లైనా దేశంలోకి ప్రవేశించి, బయటకు వెళ్లే మల్టిపుల్ ఎంట్రీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.
అయితే, ఈ ఈటీఏను ఉద్యోగం చేయడానికి లేదా దీర్ఘకాలిక నివాసానికి ఉపయోగించుకోలేరు.
దరఖాస్తు నమోదు, అవసరమైన పత్రాల అప్‌లోడ్, గుర్తింపు ధ్రువీకరణ, ఫీజు చెల్లింపు వంటి అన్ని దశలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు.
దీంతో ప్రయాణికుల సమయం, శ్రమ రెండూ ఆదా కానున్నాయి.
వివరాలు
ఎవరికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంది?
ప్రస్తుతం ఈ కొత్త ఈటీఏ విధానం భారత్, చైనా, ఇండోనేషియా, మెక్సికో దేశాలకు చెందిన సాధారణ పాస్‌పోర్ట్ హోల్డర్లకు వర్తిస్తోంది.
అయితే, ఈ సౌకర్యాన్ని వినియోగించే ప్రయాణికులు దక్షిణాఫ్రికాలోకి ప్రభుత్వం నిర్దేశించిన విమానాశ్రయాల ద్వారానే ప్రవేశించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విమానాశ్రయాలు ఇవే.
O.R. టాంబో అంతర్జాతీయ విమానాశ్రయం - జోహన్నెస్‌బర్గ్
కేప్‌టౌన్ అంతర్జాతీయ విమానాశ్రయం
లాన్సెరియా అంతర్జాతీయ విమానాశ్రయం
భవిష్యత్తులో మరిన్ని విమానాశ్రయాలను కూడా ఈ జాబితాలో చేర్చనున్నట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వం వెల్లడించింది.
వివరాలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే విధానం
దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ రూపంలోనే పూర్తి చేయవచ్చు.
మొదటి దశ: దక్షిణాఫ్రికా అధికారిక ETA పోర్టల్‌లో అకౌంట్ నమోదు చేసుకోవాలి.
రెండో దశ: ప్రయాణానికి ఉపయోగించే పాస్‌పోర్ట్ ఫోటోను అప్‌లోడ్ చేయాలి.
మూడో దశ: ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత వివరాలు, ప్రయాణ సమాచారం నమోదు చేయాలి.
నాలుగో దశ: స్మార్ట్‌ఫోన్ ద్వారా లైవ్ ఫోటో తీసి బయోమెట్రిక్ ధ్రువీకరణను పూర్తి చేయాలి.
ఐదో దశ: దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
ఆరో దశ: దరఖాస్తును సమర్పించిన తర్వాత దాని స్థితిని ఆన్‌లైన్‌లోనే ట్రాక్ చేసుకోవచ్చు.
వివరాలు
ఆమోదం తర్వాత ఏం జరుగుతుంది?
దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత ETA డిజిటల్ రూపంలోనే ప్రయాణికుడి పాస్‌పోర్ట్‌కు అనుసంధానమవుతుంది.
అలాగే QR కోడ్తో కూడిన డిజిటల్ నిర్ధారణ పత్రం కూడా అందుతుంది.
ఈ కొత్త వ్యవస్థతో భారతీయ ప్రయాణికులు వీసా కోసం ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, తక్కువ సమయంలోనే అనుమతి పొందే అవకాశం ఉంటుంది.
దీంతో దక్షిణాఫ్రికా పర్యటనను ముందుగానే సులభంగా ప్రణాళిక చేసుకుని మరింత సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.