LOADING...
Indian UN Mission:ఐరాసలోని భారత శాశ్వత మిషన్ భవనం ఖాళీ..ఎందుకంటే..?
ఐరాసలోని భారత శాశ్వత మిషన్ భవనం ఖాళీ..ఎందుకంటే..?

Indian UN Mission:ఐరాసలోని భారత శాశ్వత మిషన్ భవనం ఖాళీ..ఎందుకంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2026
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్మాణంలో ఉన్న ఓ ఎత్తైన భవనంలో నిర్మాణ లోపాలు బయటపడటంతో సమీప ప్రాంతంలో అత్యవసర పరిస్థితి నెలకొంది. కూలిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి(ఐరాస)లోని భారత శాశ్వత మిషన్ కార్యాలయం సహా పలు భవనాలను అధికారులు ఖాళీ చేయించారు. ఐరాస ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న భారత శాశ్వత మిషన్ భవనంలో కార్యాలయాలతో పాటు భారతీయ దౌత్యవేత్తలు, ఇతర అధికారులు నివసించే నివాసాలూ ఉన్నాయి. తరలింపు ఆదేశాల అనంతరం అన్ని భారతీయ దౌత్యవేత్తలు,వారి కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారని,అధికారులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తున్నారని సమాచారం. 1993లో నిర్మించిన ఈ 27 అంతస్తుల ఎర్ర గ్రానైట్ భవనాన్ని ప్రముఖ భారతీయ వాస్తుశిల్పి చార్ల్స్ కొరియా రూపకల్పన చేశారు.

వివరాలు 

21వ అంతస్తులో తీవ్రమైన నిర్మాణ లోపాలు

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్‌దానీ తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో మాన్‌హాటన్‌లోని 42వ వీధిలో నిర్మాణంలో ఉన్న భవనంలో నిర్మాణ సమస్య ఉన్నట్లు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, భవనాల శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించగా 21వ అంతస్తులో తీవ్రమైన నిర్మాణ లోపాలు గుర్తించారు. భవనానికి ఆధారంగా ఉన్న రెండు ప్రధాన స్టీల్ స్తంభాలు వంగిపోవడంతో పాటు పలు చోట్ల పగుళ్లు, అంతస్తులు కుంగినట్లు గుర్తించారు. అంతేకాక ఒక దెబ్బతిన్న స్తంభంలో ఇంకా కదలికలు కనిపిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. దీంతో భవనం ప్రస్తుతం పూర్తిగా అస్థిరంగా ఉందని మేయర్ పేర్కొన్నారు.

వివరాలు 

భవనం ఒకప్పుడు ప్రముఖ ఔషధ సంస్థ ఫైజర్ ప్రధాన కార్యాలయం

ఈ భవనం ఒకప్పుడు ప్రముఖ ఔషధ సంస్థ ఫైజర్ ప్రధాన కార్యాలయంగా ఉపయోగించబడింది. ప్రస్తుతం దీనిని వాణిజ్య కార్యాలయ భవనం నుంచి నివాస సముదాయంగా మార్చే పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణ ఇంజినీర్లు,అత్యవసర సిబ్బంది కలిసి 21వ అంతస్తును అదనపు స్టీల్ బీమ్‌లతో సురక్షితంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. న్యూయార్క్ అగ్నిమాపక శాఖ చీఫ్ జాన్ ఎస్పొసిటో మాట్లాడుతూ, స్టీల్ బీమ్‌లు అధిక బరువు కారణంగా వంగిపోతున్నాయని,అందుకే భవనంతో పాటు పరిసర ప్రాంతాలను కూడా ఖాళీ చేయించామని తెలిపారు. తాము అక్కడికి చేరుకున్న తర్వాత కూడా భవనంలో కదలికలు కొనసాగాయని చెప్పారు. పరిస్థితిని అంచనా వేయడానికి డ్రోన్లను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం వరకు నిర్మాణపనుల్లో ఉన్న కార్మికులందరూ సురక్షితంగా బయటకు వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు.

Advertisement

వివరాలు 

పాదచారులు, వాహనాల రాకపోకలు నిలిపివేత 

ఈ ఘటన నేపథ్యంలో 40వ వీధి నుంచి 45వ వీధి వరకు, ఫస్ట్ అవెన్యూ నుంచి థర్డ్ అవెన్యూ మధ్య ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా మూసివేశారు. పాదచారులు, వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ఆ ప్రాంతానికి వెళ్లవద్దని ప్రజలకు అధికారులు సూచించారు. న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోకుల్ మాట్లాడుతూ రాష్ట్ర అత్యవసర సేవల బృందాలు సంఘటన స్థలంలో పనిచేస్తున్నాయని, అవసరమైన అన్ని సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నగర అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగుతోందని తెలిపారు.

Advertisement

వివరాలు 

దెబ్బతిన రెండు ప్రధాన లోడ్‌ బేరింగ్‌ స్తంభాలు

21వ అంతస్తులోని రెండు ప్రధాన లోడ్‌ బేరింగ్‌ స్తంభాలు దెబ్బతినడంతో భవనం కొంత భాగం కూలిపోయే ప్రమాదం ఉందని న్యూయార్క్ సిటీ కాంప్ట్రోలర్ మార్క్ లెవిన్ తెలిపారు. భవనం పూర్తిగా స్థిరపడిన తర్వాత మాత్రమే లోపలికి ప్రవేశించి అదనపు స్టీల్ బీమ్‌లను అమర్చే అవకాశం ఉంటుందని అగ్నిమాపక శాఖ వెల్లడించింది. అలాగే ఈ ప్రమాదకర పరిస్థితికి కారణాలపై సమగ్ర దర్యాప్తు కూడా చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement