LOADING...
Paul Ingrassia: భారత్‌పై విషం కక్కిన ట్రంప్‌ నామినీ ఇంగ్రాసియాకి చుక్కెదురు..!
భారత్‌పై విషం కక్కిన ట్రంప్‌ నామినీ ఇంగ్రాసియాకి చుక్కెదురు..!

Paul Ingrassia: భారత్‌పై విషం కక్కిన ట్రంప్‌ నామినీ ఇంగ్రాసియాకి చుక్కెదురు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2025
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌ నామినీకి ఇప్పుడు కఠిన ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ "ఆఫీస్‌ ఆఫ్‌ స్పెషల్‌ కౌన్సిల్‌" అధిపతిగా ప్రతిపాదించిన పాల్‌ ఇంగ్రాసియా (Paul Ingrassia) ఇటీవల చేసిన జాత్యహంకార వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. భారతీయులను నమ్మకూడదంటూ, వారిని మార్చలేమంటూ మాట్లాడిన ఇంగ్రాసియాకు తాజాగా రిపబ్లికన్‌ పార్టీ నుంచి కూడా మద్దతు లేకుండా పోయింది. దీంతో తన నామినేషన్‌ను స్వయంగా వెనక్కి తీసుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు.

వివరాలు 

అమెరికా అభివృద్ధికి ట్రంప్‌తో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నా: ఇంగ్రాసియా

"ప్రస్తుతం నాకు సరిపడా రిపబ్లికన్‌ మద్దతు లేదు. కాబట్టి సెనెట్‌ కమిటీ ముందుకు నా నామినేషన్‌ను కొనసాగించకుండా ఉపసంహరించుకుంటున్నా," అని ఇంగ్రాసియా తన సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. తనకు అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అమెరికా అభివృద్ధికి ట్రంప్‌తో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఇక జాత్యహంకార వ్యాఖ్యలు బయటకు రావడంతో వైట్‌హౌస్‌ ఆయన నామినేషన్‌ను రద్దు చేయబోతుందని సెనెట్‌ మెజార్టీ నాయకుడు జాన్‌ థూన్‌ ముందుగానే వెల్లడించారు. ఆ ప్రకటన అనంతరం ఇంగ్రాసియా తన పోస్టులో నామినేషన్‌ ఉపసంహరణను ధృవీకరించారు.

వివరాలు 

వివేక్‌ రామస్వామిని ఉద్దేశిస్తూనే వ్యాఖ్యలు

ఇంతకు ముందు, తోటి రిపబ్లికన్లతో జరిగిన చాటింగ్‌లో భారతీయులపై ఇంగ్రాసియా తీవ్రంగా విమర్శలు చేశారు. భారతీయులను నమ్మకూడదని, వారు ఎప్పటికీ మారరని, దేశంలోని ఉన్నత పదవుల్లో శ్వేతజాతీయులే ఉండాలని వ్యాఖ్యానించారు. అంతేకాక, నల్లజాతీయుల విషయానికి వస్తే తనకు నాజీ భావాలు కలుగుతాయని కూడా అన్నారు. ఆ చాట్‌ లీక్‌ అవడంతో ఆయనపై విపరీతమైన వ్యతిరేకత చెలరేగింది. భారతీయ-అమెరికన్‌ వ్యాపారవేత్త, రిపబ్లికన్‌ నేత వివేక్‌ రామస్వామిని ఉద్దేశిస్తూనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఆయన వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో, అమెరికా రాజకీయ వర్గాల్లో ఇంగ్రాసియాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.