Oxfam report: సామాన్యులకు రాజకీయ అవకాశాలు కల్పించిన భారత రిజర్వేషన్ విధానం: ఆక్స్‌ఫాం నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణ ప్రజలకు రాజకీయ సాధికారతను అందించడం ద్వారా సమాజంలో ప్రగతిని సాధించవచ్చన్న దానికి భారతదేశ రిజర్వేషన్ విధానం అద్భుత ఉదాహరణగా నిలిచిందని ''ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్'' సంస్థ పేర్కొంది. ఈ అంశాన్ని ప్రపంచ అసమానతలపై 56వ వార్షిక 'ప్రపంచ ఆర్థిక వేదిక'(డబ్ల్యూఈఎఫ్)సమావేశాల మొదటి రోజు,సోమవారం విడుదలైన నివేదికలో ప్రస్తావించింది. నివేదికలో,సాధారణ ప్రజల కంటే ధనికులు రాజకీయ అధికారాన్ని నిలుపుకోవడానికి 4 వేల రెట్లు ఎక్కువ అవకాశాలు కలిగి ఉన్నారని వెల్లడించబడింది. అసమానతలు ఎంత ఉన్నా,ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలు ప్రభావం చూపగల సామాజిక,రాజకీయ, వ్యవస్థాగత పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే సాధారణులు రాజకీయంగా బలపడగలరని నివేదిక స్పష్టం చేసింది.
వివరాలు
ధనికుల సంపద: రూ.1,660 లక్షల కోట్ల పెరుగుదల
''భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర అట్టడుగు వర్గాలకున్న రాజకీయ రిజర్వేషన్లు ఆర్థికంగా, సామాజికంగా నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తున్నాయి. ఇది పేదలకు అనుకూల విధానాలను రూపొందించడంలో సహకరిస్తుంది'' అని ఆక్స్‌ఫాం తెలిపింది. సాధారణ ప్రజలతో పోలిస్తే రాజకీయ అధికారం పొందడానికి, దాన్ని నిలుపుకోవడానికి 4 వేల రెట్లు ఎక్కువ అవకాశాలు ఉన్న ధనికుల సంపద 2025లో గతానికి పోలిస్తే మూడు రెట్లు వేగంగా పెరిగిందని ఆక్స్‌ఫాం నివేదిక తెలిపింది. గత సంవత్సరంలో ధనిక వర్గాల సంపద 18.3 లక్షల కోట్ల డాలర్లుగా, అంటే సుమారు రూ.1,660 లక్షల కోట్ల మేర పెరిగినట్టు నివేదిక వివరించింది.