USA: ట్రంప్ విధానాల దెబ్బ.. అమెరికాలో తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే భారతీయులు,చైనీయుల సంఖ్య తగ్గుతోంది. వలస విధానాల్లో మార్పులు,విదేశీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గడం వంటి పరిణామాలతో విద్యార్థులు అమెరికా వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితి అక్కడి విశ్వవిద్యాలయాలపైనా ప్రభావం చూపుతోంది. 2025-26 విద్యా సంవత్సరంలో అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 6శాతం తగ్గి 3,39,435కు చేరింది. చైనా విద్యార్థుల సంఖ్య కూడా 4 శాతం తగ్గి 2,54,458గా నమోదైంది. మొత్తంగా అమెరికాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 18శాతం పడిపోయింది. అయితే బంగ్లాదేశ్,నేపాల్,పాకిస్థాన్,ఇటలీ వంటి దేశాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగింది.
వివరాలు
అమెరికాలో గణనీయంగా పడిపోయిన ఉన్నత విద్యలో ప్రవేశాలు
అమెరికాలో విదేశీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతుండటంతో పాటు వలస నిబంధనల్లో చోటుచేసుకుంటున్న మార్పులు విద్యార్థుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి.
2026లో గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య 15 శాతం తగ్గగా.. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు 3 శాతం తగ్గాయి.
ఓపెన్ డోర్స్ సంస్థ అంచనాల ప్రకారం అమెరికాలో ఉన్నత విద్యలో ప్రవేశాలు గణనీయంగా పడిపోయాయి.
ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న విధానాల పూర్తి ప్రభావం ఇంకా కనిపించాల్సి ఉందని ఆ సంస్థ పేర్కొంది.
దాదాపు 800 విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలు 9శాతం వరకు తగ్గినట్లు వెల్లడించింది. కొత్తగా చేరుతున్న విద్యార్థుల సంఖ్యలో 15శాతం క్షీణత నమోదైంది.
అయితే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కార్యక్రమంలో పాల్గొంటున్న భారతీయుల సంఖ్య మాత్రం పెరిగింది.
వివరాలు
ఒక్క ఏడాదిలోనే పరిస్థితి తారుమారు!
ఈ విభాగంలో భారతీయుల సంఖ్య 27 శాతం పెరిగి 1,82,201కు చేరడం గమనార్హం.
ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందు 2024-25 విద్యా సంవత్సరంలో అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 3,43,019గా ఉంది.
అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 10 శాతం ఎక్కువ. అయితే ఆ తర్వాత ఏడాదిలోనే పరిస్థితి మారిపోయింది.
2025-26లో భారతీయ విద్యార్థుల సంఖ్య 6 శాతం తగ్గడం అమెరికా విద్యారంగంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అద్దం పడుతోంది.
వివరాలు
అమెరికా యూనివర్సిటీలకు ఆర్థికంగా భారీ దెబ్బ!
అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడం అమెరికా విశ్వవిద్యాలయాలకే కాకుండా ఆ దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతోంది.
అమెరికా వాణిజ్య శాఖ లెక్కల ప్రకారం.. అక్కడి విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థులు చేరడం వల్ల ఏటా 57 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోంది.
ప్రధానంగా ట్యూషన్ ఫీజుల రూపంలో ఈ మొత్తం విద్యాసంస్థలకు అందుతోంది.
విద్యార్థులు తమ వ్యక్తిగత అవసరాల కోసం అమెరికాలో చేసే ఖర్చులు దీనికి అదనం. అంతర్జాతీయ విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరో విధంగానూ తోడ్పడుతున్నారు.
కంపెనీలు, విశ్వవిద్యాలయాలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన ప్రతిభావంతుల్లో చాలామంది విదేశాల నుంచి ఉన్నత విద్య కోసం వచ్చేవారే.
చదువు పూర్తయిన తర్వాత వీరిలో కొందరు అమెరికాలోనే ఉద్యోగాలు చేస్తూ ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్నారు.
వివరాలు
అమెరికా యూనివర్సిటీలకు ఆర్థికంగా భారీ దెబ్బ!
అయితే ఇప్పుడు విద్యార్థుల సంఖ్య తగ్గడంతో విశ్వవిద్యాలయాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఆదాయం తగ్గడంతో ఖర్చులను నియంత్రించుకునేందుకు కొన్ని కోర్సులను మూసివేయడం, మరికొన్నింటిని విలీనం చేయడం, ఉద్యోగులను తొలగించడం వంటి చర్యలు చేపడుతున్నాయి.
నార్త్ టెక్సాస్ యూనివర్సిటీ ఏకంగా 70 అకడమిక్ ప్రోగ్రాములను రద్దు చేయడం లేదా ఇతర కోర్సుల్లో విలీనం చేసింది.
అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడమే ఈ నిర్ణయానికి కారణమని వెల్లడించింది.
ఇదే పరిస్థితుల నేపథ్యంలో పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ కూడా ఖర్చులను తగ్గించుకునే చర్యలు ప్రారంభించింది.
మరోవైపు విదేశీ విద్యార్థుల ప్రవేశాలు తగ్గడంతో బోస్టన్ యూనివర్సిటీ ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించింది.
వివరాలు
అమెరికా యూనివర్సిటీలకు ఆర్థికంగా భారీ దెబ్బ!
విదేశీ విద్యార్థులు చెల్లించే అధిక ట్యూషన్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయాన్ని విశ్వవిద్యాలయాలు స్థానిక విద్యార్థులకు పరోక్షంగా రాయితీలు అందించేందుకు ఉపయోగించేవి.
ఇప్పుడు అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఆ ఆదాయం కూడా తగ్గుతోంది.
దీంతో స్థానిక విద్యార్థులకు గతంలో మాదిరిగా రాయితీలు కల్పించడం కష్టంగా మారుతోంది.
ఈపరిణామాలపై అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ అధ్యక్షుడు రవి వి. బెల్లంకొండ న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడారు.
ప్రతిభావంతులను కోల్పోవడం అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతోందని అభిప్రాయపడ్డారు.
అమెరికాకు బదులుగా ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఐరోపా,ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.
అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో కొనసాగుతున్న ఈ మార్పులు అమెరికా విశ్వవిద్యాలయాల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశముంది.