Libya: లిబియా తీరంలో మునిగిన పడవ.. 61 మంది మృతి
మధ్యధరా సముద్రం లిబియా తీరంలో జరిగిన ఓడ ప్రమాదంలో 60 మందికి పైగా వలసదారులు మునిగిపోయారని భావిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) తెలిపింది. శనివారం సుమారు 86 మందితో ఓడ జువారా నగరం నుంచి బయలుదేరిందని తెలిపింది. ఎత్తైన అలలకు పడవ మునిగిందని, దీంతో పిల్లలతో సహా 61 మంది వలసదారులు మునిగిపోయారని ఐఓఎం తెలిపింది. మధ్యధరా సముద్రం దాటి ఐరోపాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వలసదారులకు లిబియా తీరాన్ని ఉత్తమ మార్గంగా భావిస్తారు. ఒక్క ఈ ఏడాదిలోనే 2,200 మందికి పైగా ప్రజలు ఈ క్రాసింగ్‌ను దాటేందుకు ప్రయత్నించి మునిగిపోయారని ఐఓఎం పేర్కొంది.
మృతి చెందిన వారందరూ ఆఫ్రికన్స్
తాజా ఘటనలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది నైజీరియా, గాంబియా, ఇతర ఆఫ్రికన్ దేశాలకు చెందినవారని ఐఓఎం తెలిపింది. ప్రాణాలతో బయటపడిన 25 మందిని లిబియా నిర్బంధ కేంద్రానికి తరలించారని, వారికి వైద్య సహాయం అందిస్తున్నామని కూడా వెల్లడించింది. జూన్‌లో దక్షిణ గ్రీస్‌లో ఫిషింగ్ బోట్ మునిగిపోవడంతో కనీసం 78 మంది మరణించారు. ఈ ఘటనలో మరో 100 మందిని రక్షించారు. ట్యునీషియా, లిబియా నుంచి ఈ సంవత్సరం 1,53,000 కంటే ఎక్కువ మంది వలసదారులు ఇటలీకి చేరుకున్నట్లు ఐఓఎం పేర్కొంది.