Hormuz: హర్మూజ్ రుసుములపై ఇరాన్-ఒమన్ కీలక చర్చలు.. కొత్త ఒప్పందానికి అడుగులు?
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్-ఒమన్ మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ వెల్లడించారు. రెండు రోజుల పాటు టెహ్రాన్‌లో ఇరుదేశాల డిప్యూటీ విదేశాంగశాఖ మంత్రులు విస్తృతంగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఇరుదేశాల సార్వభౌమాధికారానికి భంగం కలగకుండా, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకం ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించినట్లు పేర్కొన్నారు. సాంకేతిక, రాజకీయ అంశాలపై ఇరువైపులా అభిప్రాయాలు పంచుకున్నారని, అమెరికా దాడులు నిలిచిన తర్వాత ఒమన్‌తో చర్చలు మరింత పురోగమిస్తున్నాయని చెప్పారు.
వివరాలు
నౌకలపై సేవా రుసుము
హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సేవా రుసుములు విధించే అంశాన్ని జూన్‌లోనే ఇరాన్, ఒమన్ కలిసి ప్రస్తావించాయి.
అయితే ఈ ప్రతిపాదన అమెరికాకు ఆమోదయోగ్యంగా లేకపోవడంతో, ఇరాన్‌తో తాత్కాలిక ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే హర్మూజ్ కేంద్రంగా మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి.
హర్మూజ్‌పై ఆధిపత్యం సాధించే ప్రయత్నంలో అమెరికా మళ్లీ దాడులు ప్రారంభించగా, వాటిని ఇరాన్ తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
తమ అనుమతి లేకుండా ఒక్క వాణిజ్య నౌక కూడా హర్మూజ్ గుండా ప్రయాణించనివ్వబోమని హెచ్చరించింది.
దీంతో ప్రత్యామ్నాయ మార్గంగా హర్మూజ్‌కు ఎదురుగా ఉన్న ఒమన్ తీరం గుండా నౌకల రాకపోకలను అమెరికా ప్రోత్సహించింది. ఇందుకు ఒమన్ కూడా అంగీకరించింది.
వివరాలు
పరస్పర అవగాహనతో ముందుకు
ఒమన్ నిర్ణయంపై ఇరాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి హెచ్చరికలు జారీ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
అయితే గత కొన్ని రోజులుగా అమెరికా ఇరాన్‌పై దాడులను నిలిపివేయడంతో, టెహ్రాన్-మస్కట్ మధ్య చర్చలు మళ్లీ వేగం పుంజుకున్నాయి.
హర్మూజ్ నిర్వహణ, నౌకాయాన భద్రత, వాణిజ్య రవాణా నిరంతరాయంగా కొనసాగేందుకు ఇరుదేశాలు పరస్పర అవగాహనతో ముందుకు సాగుతున్నట్లు ఇరాన్ వెల్లడించింది.