Iran War: ఇరాన్ దాడులతో అమెరికాకు బిలియన్ డాలర్ల భారీ నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం కారణంగా అమెరికాకు భారీ ఆర్థిక, సైనిక నష్టం వాటిల్లినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పర్షియన్ గల్ఫ్ పరిధిలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్లో ఉన్న అమెరికా బేసులపై ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఆయుధ గిడ్డంగులు, ఆపరేషన్ కమాండ్ సెంటర్లు, విమాన హ్యాంగర్లు, శాటిలైట్ వ్యవస్థలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. రన్‌వేలు, రాడార్ వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా ఛేదించి ఇరాన్ దాడులు జరిపినట్లు తెలుస్తోంది.
వివరాలు
అధికారికంగా ప్రకటించని రక్షణశాఖ
అయితే ఇప్పటివరకు జరిగిన మొత్తం నష్టం వివరాలను అమెరికా రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించలేదు. మరమ్మతులకు మాత్రమే బిలియన్ డాలర్ల వ్యయం కావచ్చని అంచనా వేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యుద్ధానికి నిధుల కోసం అమెరికా కాంగ్రెస్ నుంచి 200 బిలియన్ డాలర్లకు పైగా అవసరమని సమాచారం. యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలోనే సైనిక కార్యకలాపాల కోసం అమెరికా సుమారు 11 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రక్షణ బడ్జెట్‌ను 1.5 ట్రిలియన్ డాలర్లకు పెంచాలని ట్రంప్ ప్రభుత్వం యుద్ధానికి ముందు ప్రతిపాదించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.