Page Loader
హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న మరో ముగ్గురికి ఉరి
మరో ముగ్గురికి ఉరిశిక్ష అమలు చేసిన ఇరాన్

హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న మరో ముగ్గురికి ఉరి

వ్రాసిన వారు Stalin
Jan 10, 2023
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న మరో ముగ్గురికి ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. హిజాబ్ ఆందోళనల్లో పాల్గొంటున్న నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ అణిచివేతపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్‌లో కొన్ని రోజుల క్రితం హిజాబ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈఘటనలో ఒక పారామిలటరీ సిబ్బంది మృతి చెందాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఇరాన్ ప్రభుత్వం.. భద్రతా సిబ్బంది మృతికి కారణమైన వారిని అరెస్టు చేసింది. అందులో ఇద్దరిని శనివారం ఉరితీసింది. ఇప్పుడు మరో ముగ్గురికి ఇరాన్ కోర్టు మరణశిక్షను విధించింది. గతేడాది సెప్టెంబర్‌లో 22 ఏళ్ల మహ్సా అమిని పోలీసుల కస్టడీలో మృతి చెందిన తర్వాత.. దేశంలో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి.

ఇరాన్

వ్యతిరేకిస్తున్న పాశ్చాత్య దేశాలు

ఇరాన్ న్యూస్ ఏజెన్సీ మిజాన్ ప్రకారం.. పారామిలటరీ సిబ్బంది మృతి కేసులో ప్రస్తుతం సలేహ్ మిర్హాషెమి, మాజిద్ కజెమీ, సయీద్ యాగౌబికు కోర్టు మరణశిక్ష విధించింది. అయితే తీర్పును వ్యతిరేకంగా అప్పీల్ చేసుకునేందుకు బాధితులకు మరో అవకాశం కల్పించింది. ఇదిలా ఉంటే.. నిరసనకారులకు మరణశిక్ష విధించడాన్ని యూరోపియన్ యూనియన్, అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇరాన్‌లో వరుస మరణ శిక్షలపై పోప్ ఫ్రాన్సిస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్‌లో జీవించే హక్కు ప్రమాదంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అణచివేత తీవ్రస్థాయిలో ఉన్నా.. టెహ్రాన్, ఇస్ఫహాన్‌తో పాటు అనేక నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ ప్రభుత్వం నలుగురిని ఉరి తీసింది.