Loading...
Islamic NATO: ఇరాన్‌కు 'ఇస్లామిక్ నాటో' ఆహ్వానం.. పశ్చిమాసియాలో పెరగనున్న కొత్త సమీకరణాలు
ఇరాన్‌కు 'ఇస్లామిక్ నాటో' ఆహ్వానం.. పశ్చిమాసియాలో పెరగనున్న కొత్త సమీకరణాలు

Islamic NATO: ఇరాన్‌కు 'ఇస్లామిక్ నాటో' ఆహ్వానం.. పశ్చిమాసియాలో పెరగనున్న కొత్త సమీకరణాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
08:08 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో భద్రతా సమీకరణాలు వేగంగా మారుతున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్‌ కలిసి ఇటీవల కుదుర్చుకున్న మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్‌లో చేరాలని ఇరాన్‌కు ఆహ్వానం అందినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను ఇరాన్‌ పరిశీలిస్తున్నట్లు ఇరాన్‌ పార్లమెంట్ అధికారిక వార్తా సంస్థ అధిపతి మెహ్దీ రహీమి వెల్లడించినట్లు పాకిస్థాన్‌ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఇరాన్‌ను ఎవరు ఆహ్వానించారు? ఎప్పుడు ప్రతిపాదన వచ్చింది? సభ్యత్వానికి ఎలాంటి షరతులు విధించారు? వంటి వివరాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు.

వివరాలు 

అధికారికంగా ధ్రువీకరించని వ్యవస్థాపక సభ్య దేశాలు 

మక్కా ఒప్పందానికి వ్యవస్థాపక సభ్య దేశాలైన సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్‌లు కూడా ఇరాన్‌కు ఆహ్వానం పంపిన విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.

సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌ ఆగస్టు 7న మక్కాలో మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందంలోని ప్రధాన అంశం పరస్పర రక్షణ వ్యవస్థ. ఒక సభ్య దేశంపై సాయుధ దాడి జరిగితే.. దాన్ని మిగిలిన సభ్య దేశాలపై జరిగిన దాడిగా పరిగణించే విధంగా ఒప్పందాన్ని రూపొందించారు.

ఈ కారణంగానే పలువురు విశ్లేషకులు మక్కా ఒప్పందాన్ని 'ఇస్లామిక్ నాటో'గా అభివర్ణిస్తున్నారు.

వివరాలు 

మక్కా పాక్ట్‌లో పరస్పర రక్షణతో పాటు రక్షణ రంగంలో సహకారానికి ప్రాధాన్యం

అయితే నాటోలోని ఆర్టికల్ 5 తరహాలో దాడి జరిగినప్పుడు ఏ సభ్య దేశం ఎలాంటి సైనిక చర్య చేపట్టాలన్న విషయాన్ని మక్కా ఒప్పందం బహిరంగ పాఠ్యంలో స్పష్టంగా పేర్కొనలేదు.

మక్కా పాక్ట్‌లో పరస్పర రక్షణతో పాటు రక్షణ రంగంలో సహకారానికి ప్రాధాన్యం ఇచ్చారు.

సంయుక్త సైనిక విన్యాసాలు, నిఘా-సమాచార భాగస్వామ్యం, రక్షణ సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, సంయుక్తంగా ఆయుధాల తయారీ, వ్యూహాత్మక సమాచార మార్పిడి వంటి అంశాలకు కూడా ఇందులో అవకాశం కల్పించారు.

ఈ కూటమిని కేవలం మూడు దేశాలకే పరిమితం చేయకూడదని పాకిస్థాన్‌ ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇది ఎక్స్‌క్లూజివ్ క్లబ్‌గా మారకూడదని పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రాంతీయ ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న సౌదీ అరేబియా, ఇరాన్

అదే సమయంలో ఇది పూర్తిగా రక్షణాత్మక కూటమి అని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌ స్పష్టం చేశారు.

భవిష్యత్‌లో ఈజిప్ట్‌ను సభ్య దేశంగా పరిగణించే అవకాశం ఉందని.. సిరియా, బంగ్లాదేశ్‌లు కూడా ఒప్పందాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ కూటమిలో ఇరాన్‌ చేరితే పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సౌదీ అరేబియా, ఇరాన్‌ చాలా కాలంగా ప్రాంతీయ ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి.

2023లో ఇరు దేశాలు దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నప్పటికీ.. వాటి మధ్య ఉన్న వ్యూహాత్మక విభేదాలు పూర్తిగా తొలగిపోలేదు.

ADVERTISEMENT

వివరాలు 

స్వతంత్ర ప్రాంతీయ భద్రతా వ్యవస్థకు బలం

ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్‌ను కూడా అదే భద్రతా కూటమిలో భాగస్వామిగా చేర్చడం వల్ల దాని స్వరూపమే మారిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇరాన్‌ను అడ్డుకునే లేదా దాని ప్రభావాన్ని ఎదుర్కొనే భద్రతా వ్యవస్థగా భావించిన కూటమి.. ఇరాన్‌ చేరికతో అదే దేశాన్ని భాగస్వామిగా చేసుకున్న విస్తృత ప్రాంతీయ భద్రతా వేదికగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఇరాన్‌ చేరిక మరో కీలక మార్పుకు కూడా దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పశ్చిమాసియాలోని అనేక దేశాలు సంప్రదాయంగా అమెరికా,పాశ్చాత్య దేశాల భద్రతా వ్యవస్థలపై ఆధారపడుతున్నాయి.

అయితే సౌదీ అరేబియా,టర్కీ,పాకిస్థాన్‌, ఇరాన్‌ వంటి దేశాలు ఒకే భద్రతా వ్యవస్థలోకి వస్తే.. ముస్లిం మెజారిటీ దేశాల మధ్య స్వతంత్ర ప్రాంతీయ భద్రతా వ్యవస్థకు బలం చేకూరే అవకాశం ఉంటుంది.

వివరాలు 

సౌదీ అరేబియా-ఇరాన్‌ సంబంధాల్లో ఇది కీలక మలుపు

అంతేకాకుండా పశ్చిమాసియాలోని కీలక ఇంధన మార్గాలు, సముద్ర రవాణా మార్గాలపై ప్రాంతీయ దేశాల మధ్య సమన్వయం మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇది అమెరికా ఆధారిత భద్రతా వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా బహుళధ్రువ ప్రాంతీయ భద్రతా వ్యవస్థ ఏర్పడే సంకేతంగా కూడా చూడవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

మక్కా పాక్ట్‌లో ఇరాన్‌ చేరిక నిజమైతే.. సౌదీ అరేబియా-ఇరాన్‌ సంబంధాల్లో ఇది కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.

గతంలో పరస్పరం ప్రత్యర్థులుగా ఉన్న ఈ రెండు దేశాలు ఒకే రక్షణ వ్యవస్థలో భాగస్వాములుగా మారడం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కూడా ప్రభావం చూపవచ్చు.

వివరాలు 

సభ్య దేశంపై దాడి జరిగితే కూటమి ఎలా స్పందిస్తుంది?

అయితే అదే సమయంలో పలు కీలక ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి.

ఒక సభ్య దేశంపై దాడి జరిగితే కూటమి ఎలా స్పందిస్తుంది? ఇరాన్‌ సభ్యుడిగా ఉన్న పరిస్థితిలో ఇతర దేశాల భద్రతా బాధ్యతలు ఎలా అమలవుతాయి? వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

అందుకే ఇరాన్‌ అధికారికంగా మక్కా డిఫెన్స్ పాక్ట్‌లో చేరుతుందా లేదా అన్నది ప్రస్తుతం పశ్చిమాసియా రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది.

ADVERTISEMENT