LOADING...
Toll on Hormuz Strait: ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన.. హర్మూజ్‌పై టోల్ వసూళ్లకు ఇరాన్ సిద్ధం?
ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన.. హర్మూజ్‌పై టోల్ వసూళ్లకు ఇరాన్ సిద్ధం?

Toll on Hormuz Strait: ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన.. హర్మూజ్‌పై టోల్ వసూళ్లకు ఇరాన్ సిద్ధం?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2026
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని తీవ్ర హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా రెండు వారాల కాల్పుల విరమణ ప్రణాళికను ప్రకటించారు. తాము ప్రతిపాదించిన పది షరతులను అమెరికా ఆమోదించిందని ఇరాన్ వెల్లడించింది. ఆ షరతుల్లో హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ అంశం కూడా ఉన్నట్లు తెలిపింది. ఈ కాల్పుల విరమణ ప్రణాళికలో భాగంగా ఇరాన్, ఒమన్ దేశాలకు హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లే నౌకల నుంచి రుసుము వసూలు చేసే అవకాశం లభించినట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్ వరకు విస్తరించిన ఈ కీలక జలమార్గం కేవలం 53 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది.

వివరాలు 

రుసుములు భారం

ఇక్కడి నుంచి వెళ్లే నౌకలపై రుసుము వసూలు చేసి సమీకరించే నిధులను దేశ పునర్నిర్మాణానికి వినియోగిస్తామని ఇరాన్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటివరకు ఇది అంతర్జాతీయ జలమార్గంగా ఉండటంతో ఎలాంటి రుసుములు లేకుండా నౌకలు సంచరించేవి. అయితే ఇజ్రాయెల్-అమెరికా దాడుల నేపథ్యంలో ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధంతో ప్రపంచం ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిలో కొత్తగా విధించే రుసుములు భారం పెంచవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఇరాన్ సుప్రీం జాతీయ భద్రతా మండలి ప్రకటించింది. శుక్రవారం నుంచి పాకిస్థాన్‌లో అమెరికాతో చర్చలు జరగనున్నట్లు తెలిపింది.

వివరాలు 

ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియకు ఊతం

ఈ రెండు వారాల పాటు జలసంధి మార్గంలో నౌకల రాకపోకలను ఇరాన్ సైన్యం పర్యవేక్షణలోనే అనుమతిస్తామని పేర్కొంది. ఇక రుసుము అధికారికంగా వసూలు చేయడానికి అవసరమైన చట్టాన్ని ఇరాన్ పార్లమెంట్ ఇప్పటికే ఆమోదించింది. మరోవైపు హర్మూజ్ రవాణా పునరుద్ధరణకు అమెరికా సహకారం అందిస్తుందని, భారీ ఆదాయం పొందే అవకాశం ఉందని ట్రంప్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. దీని ద్వారా ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియకు ఊతం లభిస్తుందని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో నౌకలపై రుసుము వసూళ్లు అమల్లోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రుసుము సుమారు 18 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని సమాచారం.

Advertisement