Dirty Bomb Attack: అమెరికాపై ఇరాన్ రసాయన దాడికి కుట్ర?.. వాషింగ్టన్‌లో హై అలర్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని కీలక అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడేందుకు ఇరాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. వాషింగ్టన్‌లో డర్టీ బాంబు లేదా రసాయన ఆయుధాలతో దాడి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏడుగురు అమెరికా అధికారుల వివరాలను ఉటంకిస్తూ సీఎన్‌ఎన్ ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాలు, లక్ష్యాలను గుర్తించి ఇరాన్ ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే దీనర్థం తక్షణమే దాడి జరగబోతోందని కాదని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో అవసరం ఏర్పడితే ఉపయోగించుకునేందుకు ఇరాన్ వివిధ అవకాశాలను పరిశీలిస్తోందని పేర్కొన్నారు.
వివరాలు
సుదీర్ఘ యుద్ధం చేయబోం: జేడీ వాన్స్
దాడి జరగబోతోందనే విషయానికి సంబంధించి ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేవని తెలిపారు.
అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా అమెరికా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైట్‌హౌస్ ప్రతినిధి లారెన్ బిస్ వెల్లడించారు.
మరోవైపు ఇరాన్‌తో సుదీర్ఘకాలం యుద్ధాన్ని కొనసాగించే ఉద్దేశం అమెరికాకు లేదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు.
ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ అణు కార్యక్రమం అమెరికా భద్రతకు ముప్పుగా మారిందని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుత సంఘర్షణ పదేళ్లు లేదా పదిహేనేళ్లపాటు కొనసాగబోదని స్పష్టం చేశారు.
కనీసం రెండేళ్లపాటు కూడా అమెరికా సైనికంగా ఈ యుద్ధంలో నిమగ్నమయ్యే పరిస్థితి ఉండదని తెలిపారు.
వివరాలు
ఇరాక్‌లో కతాయిబ్ హెజ్బొల్లాకు షాక్.. సైన్యం మోహరింపు
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంఘర్షణకు అమెరికాకు అనుకూలమైన ఫలితాలతో ముగింపు పలుకుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఇరాన్‌కు అనుకూలంగా వ్యవహరించే సాయుధ సంస్థ కతాయిబ్ హెజ్బొల్లాపై ఇరాక్ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది.
ఆ సంస్థ ఆధిపత్యంలో ఉన్న జుర్ఫ్ అల్ నస్ర్ పట్టణంలోకి సైన్యాన్ని పంపాలని నిర్ణయించింది.
అక్రమ చమురు రవాణాపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఈ ప్రాంతం నుంచి సాయుధ సంస్థ వెనక్కి వెళ్లేందుకు గడువు కూడా విధించారు.
వివరాలు
ఇరాక్‌లో కతాయిబ్ హెజ్బొల్లాకు షాక్.. సైన్యం మోహరింపు
బాగ్దాద్‌కు దక్షిణంగా ఉన్న ఈ పట్టణాన్ని గతంలో జుర్ఫ్ అల్-సఖర్ అని పిలిచేవారు.
శుక్రవారంలోగా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని కతాయిబ్ హెజ్బొల్లాకు గడువు ఇచ్చినట్లు ఇరాక్ అధికారి ఒకరు అల్‌జజీరాకు వెల్లడించారు.
పట్టణం చుట్టూ అదనపు భద్రతా బలగాలను మోహరించాలని, ప్రభుత్వ సైన్యం లోపలికి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు.
ఈ పరిణామాలతో ఇరాక్ సైన్యానికి, సాయుధ సంస్థకు మధ్య ప్రత్యక్ష ఘర్షణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
అక్రమ చమురు రవాణాపై నిఘా
జుర్ఫ్ అల్ నస్ర్ ప్రాంతం నుంచి చమురు ట్యాంకర్లు, పెట్రోలియం ఉత్పత్తులను తరలించే వాహనాలు బయటకు వెళ్లకుండా భద్రతా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.
అక్రమ చమురు శుద్ధి కేంద్రాలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ఇరాన్ ప్రభావాన్ని తగ్గించాలని అమెరికా, దాని గల్ఫ్ మిత్రదేశాలు ఇరాక్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి.
అయితే తమపై వస్తున్న ఆరోపణలను కతాయిబ్ హెజ్బొల్లా ఖండించింది. చమురు పైప్‌లైన్లలో ఎలాంటి అక్రమాలు గుర్తించలేదని పేర్కొంది.
ఈ పరిణామాలతో ఇరాక్‌లో సాయుధ సంస్థల కార్యకలాపాలు, అక్రమ చమురు రవాణా వ్యవహారం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.