Iran War News: హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త మెలిక.. ఒక్కో నౌకపై రూ.16.5 కోట్లు ఫీజు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ చమురు వాణిజ్యానికి అత్యంత కీలకంగా భావించే హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని కుదిపేస్తోంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నఈ సమయంలో,ఈ జలసంధి గుండా వెళ్లే ప్రతి వాణిజ్య నౌకపై భారీ ట్రాన్సిట్ ఫీజు విధించాలని ఇరాన్ యోచిస్తోంది. ఒక్కో నౌకపై రూ.16.5 కోట్లు ఫీజు! హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే ప్రతి వాణిజ్య నౌక నుంచి 2మిలియన్ డాలర్లు(సుమారు రూ.16.5 కోట్లు)వసూలు చేయాలని ఇరాన్ ప్రతిపాదిస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన కీలక పార్లమెంట్ సభ్యుడు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు తెలిపాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రపంచ వ్యాప్తంగా రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
వివరాలు
భద్రత ఖర్చుల పేరుతో వసూళ్లు
అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రక్షణ ఖర్చులను భరించేందుకు, అలాగే జలసంధిలో భద్రతను పర్యవేక్షించేందుకు ఈ నిధులు అవసరమని ఇరాన్ వాదిస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి ఈ మార్గాన్ని మూసివేసి వాణిజ్యానికి ఆటంకాలు సృష్టించిన ఇరాన్, ఇప్పుడు పాక్షికంగా తెరిచినా భారీ ఫీజు తప్పదనే సంకేతాలు ఇస్తోంది. దీని ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం పొందాలని ఆ దేశం వ్యూహరచన చేస్తున్నట్లు కనిపిస్తోంది.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా ధరలపై ప్రభావం
రోజుకు లక్షల బ్యారెళ్ల ముడి చమురు రవాణా జరిగే ఈ జలసంధిలో టోల్ టాక్స్ అమల్లోకి వస్తే, దాని ప్రభావం గ్లోబల్ స్థాయిలో కనిపించనుంది. ఇప్పటికే యుద్ధ పరిస్థితుల కారణంగా పెరిగిన రవాణా ఖర్చులతో ఇబ్బంది పడుతున్న షిప్పింగ్ కంపెనీలకు ఇది మరింత భారంగా మారుతుంది. చివరికి ఈ అదనపు ఖర్చులు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
అంతర్జాతీయ వ్యతిరేకత పెరుగుతోంది
ఇరాన్ ప్రతిపాదనపై అంతర్జాతీయ షిప్పింగ్ కౌన్సిల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి ఏకపక్ష ఫీజులు అంతర్జాతీయ సముద్ర చట్టాలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఇప్పటికే ఇరాన్ తీర ప్రాంతాల్లో అనేక ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోవడంతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది. ఈ కొత్త నిబంధన పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే అవకాశముంది.