Loading...
Iran: అణు దాడి నుంచి ఎలా రక్షించుకోవాలి? ఇరాన్‌ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు
అణు దాడి నుంచి ఎలా రక్షించుకోవాలి? ఇరాన్‌ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు

Iran: అణు దాడి నుంచి ఎలా రక్షించుకోవాలి? ఇరాన్‌ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2026
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా దాడి చేస్తుందనే ఆందోళనల నేపథ్యంలో ఇరాన్‌ ప్రభుత్వం ప్రజలకు అణు దాడి నుంచి రక్షణ పొందేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. అణు విస్ఫోటనం జరిగితే ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో వివరిస్తూ ఎనిమిది నిమిషాల నిడివి ఉన్న వీడియోను రూపొందించింది. భవనాల బేస్‌మెంట్లు, కిటికీలు లేని లోపలి గదుల్లో ఆశ్రయం పొందాలని, తలుపులు, కిటికీలు మూసివేయాలని సూచించింది. బయటి గాలిని లోపలికి తీసుకొచ్చే ఏసీలు, వెంటిలేషన్‌ వ్యవస్థలను నిలిపివేయాలని తెలిపింది. దాడి జరిగిన తర్వాత కనీసం 24 గంటల పాటు ఆశ్రయంలోనే ఉండాలని, ప్యాక్‌ చేసిన ఆహారం, సీసాల్లోని నీటిని మాత్రమే వినియోగించాలని హెచ్చరించింది. ఈ మార్గదర్శకాలను ఇరాన్‌ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ అక్టోబర్‌ 29న ప్రచురించింది.

వివరాలు 

అధికారిక సమాచారం కోసం బ్యాటరీతో పనిచేసే రేడియో సిద్ధంగా ఉంచుకోవాలి  

అణు విస్ఫోటనం సమయంలో ఎవరైనా బయట ఉంటే పేలుడు వెలుగును నేరుగా చూడకూడదని ఇరాన్‌ ప్రభుత్వం సూచించింది.

వెంటనే నేలపై పడుకుని తల, ముఖాన్ని కాపాడుకోవాలని తెలిపింది.

పేలుడు ప్రభావం తగ్గిన తర్వాత సమీపంలోని బలమైన భవనంలోకి వెళ్లాలని, వాహనాల్లో ఆశ్రయం పొందడం సురక్షితం కాదని స్పష్టం చేసింది.

రేడియోధార్మిక ధూళి శరీరంపై పడితే బయట దుస్తులను జాగ్రత్తగా తొలగించి, మూసిన సంచిలో ఉంచాలని సూచించింది.

అనంతరం చర్మం, జుట్టును సబ్బు, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలని పేర్కొంది.

రేడియేషన్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు ఉపయోగించే అయోడిన్‌ మాత్రలను వైద్యుల సలహా లేకుండా తీసుకోవద్దని హెచ్చరించింది.

అధికారిక సమాచారం తెలుసుకునేందుకు బ్యాటరీతో పనిచేసే రేడియోలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపింది.

వివరాలు 

పికాక్స్‌ మౌంటెయిన్‌పై అమెరికా దాడి ఊహాగానాల వేళ మార్గదర్శకాల విడుదల

ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌ ప్రావిన్స్‌ అత్యవసర సేవల విభాగం రూపొందించిన ఈ వీడియో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

నతాంజ్‌ అణు కేంద్రానికి సమీపంలోని పికాక్స్‌ మౌంటెయిన్‌పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ సూచనలు వెలువడ్డాయి.

అక్టోబర్‌ 16న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశాన్ని ప్రస్తావించారు.

అయితే అణ్వాయుధాలను ఉపయోగించబోమని స్పష్టం చేశారు.

మరోవైపు, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఈ దాడి కోసం అమెరికాపై ఒత్తిడి తెస్తున్నారని జర్నలిస్ట్‌ టక్కర్‌ కార్ల్‌సన్‌ చేసిన ఆరోపణలు కూడా ఈ అంశంపై చర్చకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి.

అయితే, ఈ మార్గదర్శకాలు ఇరాన్‌ నిర్వహిస్తున్న పౌర రక్షణ వారోత్సవాల్లో భాగంగా విడుదలయ్యాయని సమాచారం.

ADVERTISEMENT