LOADING...
US vs Iran: అమెరికా డ్రోన్‌ను కూల్చేశాం.. ఇరాన్ సంచలన ప్రకటన
అమెరికా డ్రోన్‌ను కూల్చేశాం.. ఇరాన్ సంచలన ప్రకటన

US vs Iran: అమెరికా డ్రోన్‌ను కూల్చేశాం.. ఇరాన్ సంచలన ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 01, 2026
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ మరింత తీవ్రతరం అవుతున్నాయి. తాజాగా తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికాకు చెందిన ఎంక్యూ-1 డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. శత్రుత్వ చర్యలకు పాల్పడే ఉద్దేశంతో తమ జలాలు, గగనతల పరిధిలోకి వచ్చిన ఈ డ్రోన్‌ను వెంటనే గుర్తించి, గగనతల రక్షణ వ్యవస్థల ద్వారా క్షిపణులు ప్రయోగించి ధ్వంసం చేసినట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది. ఈ వివరాలను ఇరాన్ అధికారిక వార్తా సంస్థ కూడా ధృవీకరించింది.

వివరాలు 

పెరుగుతున్న దాడులు.. ప్రతిదాడులు

గత కొంతకాలంగా అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల మంగళవారం కూడా అమెరికాకు చెందిన ఎంక్యూ-9 డ్రోన్‌ను తమ రక్షణ దళాలు కూల్చివేసినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘిస్తే తగిన ప్రతీకారం తీసుకునే హక్కు తమకు ఉందని అప్పుడే ఇరాన్ హెచ్చరించింది. అదే సమయంలో తమ గగనతలంలోకి ప్రవేశించిన ఒక యుద్ధ విమానంపై కూడా కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. మరోవైపు, ఇరాన్ లక్ష్యాలపై తాము నిర్వహించినవి ఆత్మరక్షణ చర్యలేనని అమెరికా చెబుతోంది.

వివరాలు 

ఇరాన్ లక్ష్యాలపై అమెరికా దాడులు

దక్షిణ ఇరాన్‌లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, అలాగే సముద్రంలో మైన్‌లను అమర్చేందుకు ప్రయత్నిస్తున్న పడవలపై సోమవారం దాడులు నిర్వహించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్రకామ్) వెల్లడించింది. ఇరాన్ నుంచి తమ దళాలకు ఎదురయ్యే ముప్పును నివారించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, తమ సైనికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సెంట్రకామ్ ప్రతినిధి టిమ్ హాకిన్స్ స్పష్టం చేశారు. అంతేకాకుండా గురువారం రాత్రి కూడా ఇరాన్‌లోని ఓ సైనిక స్థావరంపై అమెరికా దాడులు జరిపినట్లు సమాచారం.

Advertisement

వివరాలు 

హర్మూజ్ జలసంధి వద్ద భారీ పేలుళ్లు

అమెరికా దాడులకు గురైన ఆ సైనిక స్థావరం తమ దళాలకు, అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ముప్పుగా మారిందని వాషింగ్టన్ పేర్కొంది. ఇదే సమయంలో హర్మూజ్ జలసంధి సమీపంలోని బందర్ అబ్బాస్ ఓడరేవు నగరానికి తూర్పు దిశలో గురువారం తెల్లవారుజామున మూడు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ వెల్లడించింది. అణు కార్యక్రమంపై అమెరికా ఆందోళన ఇరాన్ అణు కార్యక్రమం ప్రాంతీయ భద్రతకు ముప్పుగా మారుతోందని అమెరికా ఆరోపిస్తోంది. అణ్వాయుధాల అభివృద్ధి దిశగా ఇరాన్ అడుగులు వేస్తోందనే అనుమానాల కారణంగానే ఇజ్రాయెల్‌తో కలిసి ఈ చర్యలు చేపడుతున్నామని వాషింగ్టన్ వాదిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement