Iran: గాంధీ ఆసుపత్రి ధ్వంసం వీడియో విడుదల చేసిన ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
చర్చలు విఫలమవడంతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం వెలువడుతోంది. ఈ పరిణామాల మధ్య ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. యుద్ధం ప్రారంభ దశలో జరిగిన దాడుల్లో పౌర మౌలిక వసతులను కూడా లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది. ఈ మేరకు భారత్‌లోని ఆ దేశ ఎంబసీ ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో టెహ్రాన్ నగరంలోని మహాత్మా గాంధీ ఆసుపత్రి ధ్వంసమైన దృశ్యాలు కనిపించాయి. అది చిన్నారుల చికిత్సకు ప్రత్యేకంగా ఉన్న ఆసుపత్రి అని వీడియోలో మాట్లాడిన వ్యక్తి వివరించారు. అలాగే 600కు పైగా వైద్య వసతులు, 60 పాఠశాలలను అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు గురిచేశాయని ఆరోపించారు.
వివరాలు
గత ఏడాది జూన్ నెలలో ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి
యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ 11 దేశాలపై దాడులు చేసినప్పటికీ,ఎప్పుడూ ఆసుపత్రులు లేదా చిన్నారులను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసింది. మార్చి 2న ఈ గాంధీ ఆసుపత్రిపై దాడి జరిగినట్లు తెలిపింది.ఈ ఘటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధృవీకరించినట్లు పేర్కొంది. ఇక ఈ ఆసుపత్రిపై దాడి జరగడం ఇదే తొలిసారి కాదని ఇరాన్ వెల్లడించింది. గత ఏడాది జూన్ నెలలో కూడా ఇజ్రాయెల్ దాడి చేసినట్లు తెలిపింది. అలాగే ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన రోజున విప్లవ రక్షక దళాల స్థావరాలపై దాడులు జరుగుతుండగా మినాబ్ ప్రాంతంలోని ఒక పాఠశాలపై అమెరికాకు చెందిన తోమహాక్ క్షిపణి పడింది. ఈ ఘటనలో 160 మందికి పైగా చిన్నారులు,14మంది ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గాంధీ ఆసుపత్రిపై దాడి దృశ్యాలు
Mahatma Gandhi Hospital, Tehran. pic.twitter.com/NpvbmN32sR
— Iran in India (@Iran_in_India) April 12, 2026