Strait of Hormuz: కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ యూటర్న్.. హార్ముజ్ బంద్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాతో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుంచిన కీలక ప్రతిపాదనలలో భాగంగా హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ మొదట ఒప్పుకుంది. అయితే తాజా పరిణామాల్లో ఆ జలసంధిని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. దీంతో హార్ముజ్ ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోయాయి.
వివరాలు
హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భారీ దాడులు
ఇక లెబనాన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భారీ దాడులు జరిపింది. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణలో లెబనాన్ కూడా భాగమని ఇరాన్ వాదిస్తుండగా, ఇజ్రాయెల్ మాత్రం దాన్ని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఇజ్రాయెల్ చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో దాడులకు దిగింది. వందకు పైగా కమాండ్ సెంటర్లు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో సుమారు 254 మంది మరణించగా, 800 మందికి పైగా గాయపడ్డారు.
వివరాలు
హెజ్బుల్లాపై దాడులు కొనసాగిస్తాం: నెతన్యాహు
ఈ పరిణామాలతో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను తక్షణమే నిలిపివేస్తున్నాం. కాల్పుల విరమణ అన్ని రంగాల్లో అమలవ్వాలి. లేకపోతే అది ఎక్కడా ఉండదు" అని ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ప్రతినిధి ఇబ్రహీం రెజాయీ ఘాటుగా హెచ్చరించారు. ఈ నిర్ణయంతో ప్రపంచ దేశాలకు చమురు సరఫరాపై మళ్లీ ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. "ఇరాన్ ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా బలహీనపడింది. యుద్ధంలో మా లక్ష్యాల్లో చాలా సాధించాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహకారం ఎంతో కీలకం. మా సంబంధాలు బలంగా ఉన్నాయి. కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించదు. హెజ్బుల్లాపై దాడులు కొనసాగిస్తాం" అని స్పష్టం చేశారు.