Loading...
Iran: హర్మూజ్‌లో రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్‌ దాడి .. భారత నావికుడు మృతి, 10 మందికి గాయాలు
భారత నావికుడు మృతి, 10 మందికి గాయాలు

Iran: హర్మూజ్‌లో రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్‌ దాడి .. భారత నావికుడు మృతి, 10 మందికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2026
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణి దాడులు జరపడంతో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది భారతీయ సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. దిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌ను విదేశాంగ శాఖకు పిలిపించి తీవ్ర నిరసన తెలిపింది. వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఇదే నెల 12న హర్మూజ్ జలసంధిలో సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న జీఎఫ్‌ఎస్ గెలాక్సీ నౌకపై కూడా ఇరాన్ దాడి చేసింది. ఆ ఘటనలో ఓ భారతీయ నావికుడు గల్లంతైన విషయం తెలిసిందే.

వివరాలు 

రెండు ట్యాంకర్లపై క్షిపణి దాడి

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ప్రారంభమైన పశ్చిమాసియా ఘర్షణల్లో ఇప్పటివరకు మొత్తం 14 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

రక్షణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..యూఏఈకి చెందిన ఎంటీ మొంబాసా,ఎంటీ అల్ బాహియా అనే రెండు చమురు ట్యాంకర్లు ఒమన్ ప్రాదేశిక జలాల మీదుగా హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న సమయంలో ఇరాన్ రెండు క్రూజ్ క్షిపణులతో దాడి చేసింది.

ఈ రెండు నౌకల్లో కలిపి మొత్తం 46మంది సిబ్బంది ఉండగా,వారిలో 30మంది భారతీయ నావికులే.

ఎంటీ అల్ బాహియాలో 12మంది భారతీయులు ఉండగా,దాడిలో ఒకరు మరణించగా,మరో వ్యక్తి గాయపడ్డారు.

ఎంటీ మొంబాసాలో 18మంది భారతీయులు ఉండగా,వారిలో తొమ్మిది మంది గాయపడ్డారు.

వివరాలు 

ఇరాన్ వివరణ ఇదే..

గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదే దాడిలో ఎంటీ మొంబాసాలో పనిచేస్తున్న ఇద్దరు ఉక్రెయిన్ నావికులు కూడా గాయపడ్డారు.

ఈ రెండు చమురు ట్యాంకర్లపై దాడికి సంబంధించి ఇరాన్ తన వాదనను వెల్లడించింది.

ఎంటీ మొంబాసా, ఎంటీ అల్ బాహియా అక్రమ కార్యకలాపాలకు పాల్పడినందుకే లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొంది.

తమ నావిగేషన్ వ్యవస్థలను జామ్ చేసి, భద్రతా నియంత్రణ కేంద్రం జారీ చేసిన హెచ్చరికలను పట్టించుకోకుండా మైన్ ఫీల్డ్‌లోకి ప్రవేశించాయని ఆరోపించింది.

అమెరికా సైన్యం సూచనలను నమ్మి ముందుకు రావడంతో వాటిని నిర్వీర్యం చేసినట్లు ఇరాన్ తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

చర్చల ద్వారానే పరిష్కారం: భారత్

హర్మూజ్ ఘటనలో భారతీయ నావికుడు మరణించడంతో విదేశాంగ శాఖ (ఎంఈఏ) దిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌ను పిలిపించి తీవ్ర నిరసన తెలిపింది.

హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని కోరింది.

పశ్చిమాసియాలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఎంఈఏ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కాపాడాలంటే హింసను నిలిపివేసి, అన్ని సమస్యలను చర్చలు, దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది.

అంతర్జాతీయ జలమార్గాల్లో నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడం అత్యంత అవసరమని కూడా స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

పర్షియన్ గల్ఫ్‌లో నిలిచిపోయిన ఏడు భారత నౌకలు

ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో హర్మూజ్ జలసంధికి పశ్చిమంగా భారత జెండాతో ప్రయాణిస్తున్న ఏడు నౌకలు నిలిచిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

తాజా ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అవి ప్రస్తుతం జలసంధి దాటే అవకాశం లేదని తెలిపింది. ఆ నౌకల్లో మొత్తం 148 మంది భారతీయ నావికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT