Iran : మా రేవుల జోలికొస్తే.. గల్ఫ్ రేవులను దిగ్బంధిస్తాం: ఇరాన్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా సైనిక విభాగం ప్రకటించడంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలను అడ్డుకోవడం సముద్ర దోపిడీతో సమానమని ఇరాన్ విప్లవ గార్డులు స్పష్టం చేశారు. తమ భద్రతకు ఎలాంటి ముప్పు ఏర్పడినా పర్షియన్ గల్ఫ్ ప్రాంతమంతా సముద్ర భద్రత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. అమెరికా తమ ఓడరేవులను దిగ్బంధిస్తే తామూ గల్ఫ్ ప్రాంతంలోని అన్ని రేవులను మూసివేస్తామని వెల్లడించారు. భద్రత అందరికీ ఉండాలని, లేకపోతే ఎవరికీ ఉండకూడదని కఠినంగా పేర్కొన్నారు.
వివరాలు
ఇరాన్ అనుమతి పొందిన నౌకలకు మాత్రమే హర్మూజ్ జలసంధిలో ప్రవేశం
హర్మూజ్ జలాల్లో భద్రతను తామే పర్యవేక్షిస్తామని తెలిపారు. తమ రేవులకు ప్రమాదం ఏర్పడితే ఈ ప్రాంతంలోని ఏ ఓడరేవూ సురక్షితంగా ఉండదని స్పష్టం చేశారు. శత్రుదేశాలకు చెందిన నౌకలను జలసంధి గుండా అనుమతించబోమని వెల్లడించారు. ఇరాన్ అనుమతి పొందిన నౌకలకు మాత్రమే హర్మూజ్ జలసంధిలో ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాంతంపై పూర్తి నియంత్రణ కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.