LOADING...
US-Iran War: ఇరాన్‌తో యుద్ధం వల్ల 25 బిలియన్ డాలర్లు నష్టపోయామన్న అమెరికా
ఇరాన్‌తో యుద్ధం వల్ల 25 బిలియన్ డాలర్లు నష్టపోయామన్న అమెరికా

US-Iran War: ఇరాన్‌తో యుద్ధం వల్ల 25 బిలియన్ డాలర్లు నష్టపోయామన్న అమెరికా

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2026
08:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో జరిగిన యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెను భారాన్ని మోపింది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు సుమారు 25 బిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2.1 లక్షల కోట్లు ఖర్చయ్యాయని పెంటగాన్ బడ్జెట్ విభాగాధిపతి అధికారికంగా వెల్లడించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా ప్రభుత్వం ఇచ్చిన అత్యంత సమగ్ర అంచనా ఇదే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం ఈ వివరాలు బయటపెట్టిన ఆయన, ఇరాన్‌పై దాడుల వల్ల అమెరికా వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణులు, బాంబుల నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని తెలిపారు. యుద్ధం మొదలైన తొలి రెండు రోజుల్లోనే సుమారు 5.6 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు వినియోగించినట్లు పేర్కొన్నారు.

వివరాలు 

రక్షణ బడ్జెట్‌ను 40 శాతం పెంచాలని రక్షణ మంత్రి ప్రతిపాదన

ఈ పరిస్థితుల్లో రక్షణ బడ్జెట్‌పై జరిగిన కీలక సమావేశంలో అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ పాల్గొన్నారు. గతంలో తక్కువగా జరిగిన పెట్టుబడుల లోటును భర్తీ చేయాలంటే రక్షణ బడ్జెట్‌ను 40 శాతం పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో యుద్ధంపై ప్రతిపక్ష డెమొక్రాట్లు, కొంతమంది రిపబ్లికన్లు చేస్తున్న వ్యాఖ్యలు ఓటమిని ఆహ్వానించేలా ఉన్నాయని హెగ్సెత్ విమర్శించారు. చైనాతో ఆధిపత్య పోటీ కోసం కాకుండా, సమతుల్య సంబంధాలను కొనసాగించడమే అమెరికా లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

సహకరించని మిత్రదేశాలకు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక

అయితే, ఇరాన్ యుద్ధంలో సహకరించని మిత్రదేశాలు,ముఖ్యంగా నాటో సభ్య దేశాలు, తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, పోలాండ్ వంటి దేశాలను ఆదర్శ మిత్రదేశాలుగా ఆయన ప్రశంసించారు. ఇక గతంలో ఇరాన్ కూడా ఈ యుద్ధం వల్ల తమకు రూ.25 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని పేర్కొని, ఆ నష్టానికి అమెరికా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది.

Advertisement