Loading...
Iran: శాంతి ఒప్పందానికి బ్రేక్‌.. అమెరికా చర్యలతో వెనక్కి తగ్గిన ఇరాన్
శాంతి ఒప్పందానికి బ్రేక్‌.. అమెరికా చర్యలతో వెనక్కి తగ్గిన ఇరాన్

Iran: శాంతి ఒప్పందానికి బ్రేక్‌.. అమెరికా చర్యలతో వెనక్కి తగ్గిన ఇరాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2026
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఆందోళనకరంగా మారుతున్నాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య వరుసగా నాలుగో రోజూ పరస్పర దాడులు కొనసాగుతుండటంతో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. మధ్యవర్తుల చొరవతో ఉద్రిక్తతలు తగ్గి కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందన్న ఆశలు వ్యక్తమైనప్పటికీ.. తాజా పరిణామాలు ఆ అవకాశాలను దెబ్బతీశాయి. పరస్పర ఆరోపణలు, కవ్వింపు చర్యలతో శాంతి ప్రక్రియ మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా హర్ముజ్‌ జలసంధిపై అమెరికా తీసుకున్న తాజా నిర్ణయాలు ఒప్పంద స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించిన ఇరాన్‌.. అవగాహన ఒప్పందం (MoU) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

వివరాలు 

అవగాహన ఒప్పందంపై వివాదం

గత నెలలో స్విట్జర్లాండ్‌ వేదికగా అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాలు సైనిక ఘర్షణలను నిలిపివేసి, రెండు నెలల్లో శాశ్వత శాంతి ఒప్పందం దిశగా చర్చలు కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి.

ఇందులో అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాలు కూడా కీలక భాగంగా ఉన్నాయి. అయితే ఒప్పంద నిబంధనలను అమెరికా పదేపదే ఉల్లంఘిస్తోందని ఇరాన్‌ ఆరోపిస్తోంది.

ముఖ్యంగా తమ నౌకాశ్రయాలపై అమెరికా మరోసారి నౌకాదళ దిగ్బంధాన్ని అమలు చేయడం ద్వారా ఒప్పందాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని టెహ్రాన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

వివరాలు 

హర్ముజ్‌పై ఆధిపత్య పోరు మళ్లీ

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్‌ జలసంధి మరోసారి ఉద్రిక్తతలకు కేంద్రబిందువైంది.

ఈ మార్గంలో ప్రయాణించే ఇరాన్‌కు చెందిన నౌకలపై అమెరికా కొత్త ఆంక్షలు విధించడంతో పరిస్థితి మరింత విషమించింది.

అమెరికా చర్యలకు ప్రతిస్పందనగా ఇరాన్‌ మరోసారి దాడులకు దిగినట్లు సమాచారం.

మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార చర్యలు చేపట్టినట్లు కూడా వార్తలు వెలువడుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో రవాణా అయ్యే ముడిచమురు, సహజ వాయువులో గణనీయమైన భాగం హర్ముజ్‌ జలసంధి గుండా వెళ్లడం వల్ల.. ఈ ప్రాంతంలో ఏ ఉద్రిక్తత నెలకొన్నా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

"హర్ముజ్‌పై పూర్తి నియంత్రణ మాదే"

ఇరాన్‌ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్‌ ఘరీబాబాది కీలక వ్యాఖ్యలు చేశారు.

యుద్ధ పరిస్థితులు తలెత్తితే హర్ముజ్‌ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించేందుకు ఇరాన్‌ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

"ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా హర్ముజ్‌పై మా సార్వభౌమ హక్కును కాపాడుకుంటాం" అని ఆయన పేర్కొన్నట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది.

సాధారణ పరిస్థితుల్లో హర్ముజ్‌ జలసంధి నిర్వహణలో ఒమన్‌తో కలిసి ఇరాన్‌కు కూడా బాధ్యత ఉంటుంది.

అయితే ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్ట్యా మొత్తం మార్గంపై నియంత్రణ అవసరమని ఇరాన్‌ వాదిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

చర్చలకు తలుపులు మూసిన ఇరాన్

అమెరికాతో మరోసారి చర్చలు జరిపే ఉద్దేశం లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. తమపై ఒత్తిడి పెంచే చర్యలు కొనసాగితే తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది.

ఇప్పటికే ఇరు దేశాల మధ్య ప్రతీకార దాడులు కొనసాగుతున్న తరుణంలో.. అవగాహన ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఇరాన్‌ ప్రకటించడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది.

వివరాలు 

హర్ముజ్‌పై మళ్లీ అమెరికా బ్లాకేడ్

హర్ముజ్‌ పరిణామాల్లో అమెరికా అమలు చేస్తున్న నౌకాదళ దిగ్బంధం మరోసారి కీలకఅంశంగా మారింది.

ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా తొలిసారిగా ఏప్రిల్‌ 13న ఇరాన్‌ నౌకాశ్రయాలకు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే నౌకలపై దిగ్బంధం విధించింది.

దీంతో గల్ఫ్‌ ప్రాంతంలో సముద్ర రవాణాపై తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

తర్వాత అమెరికా-ఇరాన్‌ మధ్య తాత్కాలిక అవగాహన ఒప్పందం కుదరడంతో పరిస్థితులు కొంత సద్దుమణిగాయి.

ఒప్పందంలో భాగంగా అమెరికా జూన్‌ 18న దిగ్బంధాన్ని ఎత్తివేసింది.

దీంతో కాల్పులవిరమణ కొనసాగి..తదుపరి చర్చలకు మార్గం సుగమం అవుతుందని భావించారు.

అయితే తాజాఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా జూలై 14నుంచి ఇరాన్‌ నౌకాశ్రయాలపై నౌకాదళ దిగ్బంధాన్ని మరోసారి పునరుద్ధరించింది.

దీనిని ఒప్పంద ఉల్లంఘనగా అభివర్ణించిన ఇరాన్‌..శాంతి ప్రక్రియను అమెరికానే దెబ్బతీసిందని ఆరోపిస్తోంది.

వివరాలు 

ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం

హర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే దాని ప్రభావం అమెరికా-ఇరాన్‌ సంబంధాలకే పరిమితం కాకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో హర్ముజ్‌ ఒకటి కావడంతో.. అక్కడ రవాణాకు ఆటంకాలు ఏర్పడితే అంతర్జాతీయ చమురు మార్కెట్లు తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో తరలించే ముడిచమురు, సహజ వాయువులో గణనీయమైన భాగం ఈ జలసంధి గుండా వెళ్తుంది.

అందువల్ల చిన్న అంతరాయం జరిగినా సరఫరా వ్యవస్థ దెబ్బతిని.. అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది.

దాని ప్రభావం పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు రవాణా వ్యయాలు, నిత్యావసర వస్తువుల ధరలపైనా పడే అవకాశం ఉంది.

వివరాలు 

భారత్‌పైనా ప్రభావం

ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో హర్ముజ్‌లో సంక్షోభం మరింత తీవ్రమైతే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్‌ వంటి దేశాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.

దీంతో హర్ముజ్‌ జలసంధిని కేంద్రంగా చేసుకుని అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య వివాదంగా కాకుండా.. ప్రపంచ ఇంధన భద్రతకు, అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వానికి కొత్త సవాలుగా మారుతున్నాయి.

ADVERTISEMENT