UAE: యూఏఈ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. సిబ్బంది సేఫ్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక ఘటన చోటుచేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వ చమురు, సహజవాయువు సంస్థ అడ్నాక్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. హర్మూజ్ జలసంధి మీదుగా వాణిజ్య నౌక ప్రయాణిస్తున్న సమయంలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు యూఏఈ విదేశాంగశాఖ వెల్లడించింది. అయితే ఈ దాడిలో నౌకలోని సిబ్బంది ఎవరూ మృతి చెందలేదని తెలిపింది. వాణిజ్య నౌకపై జరిగిన ఈ దాడిని యూఏఈ తీవ్రంగా ఖండించింది. మరోవైపు ఒమన్‌లోని కసబ్ పట్టణానికి తూర్పున శనివారం ఓ వాణిజ్య నౌకను క్షిపణి ఢీకొట్టినట్లు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) వెల్లడించింది. ఈ ఘటనతో నౌకలో మంటలు చెలరేగినట్లు తెలిపింది.
వివరాలు
హూతీ స్థావరాలపై యెమెన్ సైన్యం దాడులు
అయితే క్షిపణి దాడికి గురైన ఆ వాణిజ్య నౌక అడ్నాక్ సంస్థకు చెందినదేనా అనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
యెమెన్‌లో అంతర్యుద్ధం మరింత తీవ్రంగా మారుతోంది. ఇరాన్ మద్దతు ఉన్న హూతీ మిలిటెంట్లపై యెమెన్ ప్రభుత్వ సైన్యం దాడులు ప్రారంభించింది.
మధ్య, తూర్పు యెమెన్‌లో ఉన్న హూతీల స్థావరాలు, ఆయుధాగారాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ సైనిక చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి కర్నల్ మజీద్ అల్ నజిలీ తెలిపారు.
హూతీలకు చెందిన కీలక స్థావరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ దళాలు ఈ దాడులను కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
వివరాలు
కుర్దిష్ శాంతి బిల్లుకు తొలి అడ్డంకి తొలగింపు
మరోవైపు తుర్కియేలో కుర్దిష్ మిలిటెంట్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు తొలి అవరోధం తొలగింది.
వేలాది మంది కుర్దిష్ మిలిటెంట్లకు కొన్ని షరతులతో క్షమాభిక్ష ప్రసాదించే నిబంధనతో పాటు పలు అంశాలతో రూపొందించిన ఈ బిల్లుకు తుర్కియే పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపింది.
దీంతో కుర్దిష్ మిలిటెంట్లతో శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు కీలకమైన ముందడుగు పడినట్లైంది.