Iran Missiles: హిందూ మహాసముద్రంలో ఇరాన్ క్షిపణుల దాడులు.. నిజమేనా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం మరింత విస్తరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరగా, ఇప్పుడు ఈ ప్రభావం హిందూ మహాసముద్రం వరకు విస్తరించినట్లు వార్తలు వస్తున్నాయి. చాగోస్ దీవుల్లో ఉన్న అమెరికా-బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డీగో గార్సియాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ క్షిపణులు లక్ష్యాన్ని చేరుకోలేదని సమాచారం. ఒక క్షిపణి మధ్యలోనే విఫలమవగా, మరో క్షిపణిని ఇంటర్‌సెప్టర్ వ్యవస్థ ద్వారా కూల్చివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
వివరాలు
పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరిక
ఈ ఘటనపై అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం. ఇరాన్ భూభాగానికి సుమారు 4 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న డీగో గార్సియా దీవులను లక్ష్యంగా చేసుకున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే, యుద్ధం మరింత విస్తృత స్థాయికి చేరుకున్నట్టే భావించాలి. అదే నిజమైతే యూరప్‌లోని సైనిక స్థావరాలు కూడా ఇరాన్ లక్ష్యంగా మారే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ స్పందిస్తూ, డీగో గార్సియాపై దాడి జరిగిందంటే అది పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరికగా భావించాల్సిందేనన్నారు.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా భద్రతా ఆందోళనలు ఉధృతం
గతంలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాల సమయంలో ఈ స్థావరాన్ని అమెరికా విస్తృతంగా వినియోగించింది. డీగో గార్సియా అధికారికంగా బ్రిటన్‌కు చెందిన స్థావరం అయినప్పటికీ, పశ్చిమాసియాలో సైనిక ఆపరేషన్ల సమయంలో అమెరికా దీన్ని కీలకంగా ఉపయోగిస్తుంది. ఇటీవలే ఈ ప్రాంతంలో అమెరికా తన బీ-2 స్టెల్త్ బాంబర్లను మోహరించినట్లు కూడా సమాచారం. మొత్తంగా ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా భద్రతా ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.