LOADING...
Dimona: 'లిటిల్ ఇండియా' డిమోనాపై ఇరాన్ క్షిపణి దాడులు
'లిటిల్ ఇండియా' డిమోనాపై ఇరాన్ క్షిపణి దాడులు

Dimona: 'లిటిల్ ఇండియా' డిమోనాపై ఇరాన్ క్షిపణి దాడులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2026
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా, ప్రతీకారంగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయిల్‌పై తీవ్రంగా విరుచుకుపడుతోంది. యుద్ధం ప్రారంభమై మూడు వారాలు గడిచినా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్‌లోని కీలక నగరమైన డిమోనాపై తాజాగా క్షిపణి దాడులు చోటుచేసుకున్నాయి. నెగెవ్ ఎడారిలో ఉన్న ఈ నగరం, దేశ అణు కార్యక్రమానికి ప్రధాన కేంద్రంగా ఉండటంతో అణు నగరంగా పేరుగాంచింది. ఇదే సమయంలో డిమోనాను 'లిటిల్ ఇండియా'గా కూడా పిలుస్తారు.

వివరాలు

'లిటిల్ ఇండియా'గా డిమోనా ప్రత్యేకత

డిమోనాలో సుమారు 7,500 మంది భారతీయ-యూదు సమాజానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. పట్టణ జనాభాలో దాదాపు 30 శాతం ఈ కమ్యూనిటీదే. నగరంలో మరాఠీ, కొంత హిందీ భాషలు వినిపిస్తుండగా, క్రికెట్‌పై ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుంది. ఇక్కడి వీధుల్లో జిలేబీలు, చాట్ వంటకాల సువాసనలు వెదజల్లుతుంటాయి. సోన్‌పప్డీ, గులాబ్ జామున్, పాప్రీ చాట్, భేల్‌పురి వంటి భారతీయ వంటకాలు దుకాణాల్లో సులభంగా లభిస్తాయి. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా రంగురంగుల దుస్తులు కూడా ఇక్కడ కనిపిస్తాయి.

వివరాలు

భారతీయుల వలసల చరిత్ర

1950, 1960 దశకాల్లో భారత్ నుంచి ఇజ్రాయిల్‌కు పెద్దఎత్తున వలసలు జరిగాయి. మహారాష్ట్రకు చెందిన బెనే ఇజ్రాయిలీలు, కేరళకు చెందిన కొచిన్ యూదులు, కోల్‌కతాకు చెందిన బాగ్దాదీ యూదులు ప్రధానంగా ఇక్కడికి వెళ్లి స్థిరపడ్డారు. అలాగే మిజోరం, మణిపూర్ ప్రాంతాల నుంచి బెనై మోనాషే సమాజానికి చెందినవారు కూడా ఇజ్రాయిల్‌కు వలస వెళ్లారు. ఈ వలసదారుల్లో చాలామంది వజ్రాల వ్యాపారం, ఐటీ రంగాల్లో పని చేస్తున్నారు. డిమోనాలో దీపావళి, ఓనం వంటి భారతీయ పండుగలు ఘనంగా జరుపుకుంటారు. 2025 నవంబర్‌లో నిర్వహించిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు భారీ స్పందన లభించగా, ఇటీవల జరిగిన ఇండియన్ మ్యూజిక్ ఫెస్టివల్ టిక్కెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి.

Advertisement

Details

అణు కేంద్రానికి సమీపంలో దాడులు

ఇరాన్‌లోని నటాంజ్ అణు కేంద్రంపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే శనివారం డిమోనాపై ఇరాన్ క్షిపణి దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 33 మంది గాయపడ్డారు. డిమోనాలో ఉన్న షిమోన్ పెరెస్ నెగెవ్ అణు పరిశోధనా కేంద్రం ఇజ్రాయిల్ అణు సామర్థ్యానికి కీలకంగా భావించబడుతుంది. 1958లో దీని నిర్మాణం ప్రారంభమై, 1964లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇక శనివారం డిమోనా, అరబ్ నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపింది. ఈ క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థలు విఫలమైనట్లు సమాచారం. నతాంజ్‌పై దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేపట్టినట్లు ఇరాన్ ప్రకటించింది.

Advertisement