Page Loader
Iran : ఇరాన్ లో హిజాబ్ అమలుకు వ్యతిరేకంగా బట్టలు విప్పి తిరిగిన మహిళ 
ఇరాన్ లో హిజాబ్ అమలుకు వ్యతిరేకంగా బట్టలు విప్పి తిరిగిన మహిళ

Iran : ఇరాన్ లో హిజాబ్ అమలుకు వ్యతిరేకంగా బట్టలు విప్పి తిరిగిన మహిళ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2024
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో మహిళల దుస్తులపై కఠిన నియమాలు అమల్లో ఉన్నాయి.ఇక్కడ మహిళలు తలకు స్కార్ఫ్‌లు, పూర్తిగా వదులుగా ఉండే దుస్తులు తప్పనిసరిగా ధరించాలి. అయితే,ఇటీవల ఇరాన్‌లో ఈ నియమాలను ఉల్లంఘిస్తూ ఓ మహిళ తన దుస్తులు విప్పి నిరసన తెలిపిన ఘటన చర్చనీయాంశమైంది. ఈ సంఘటన టెహ్రాన్‌లోని ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్‌ లో చోటు చేసుకుంది. విదేశీ మీడియా ప్రకారం, నైతిక పోలీసులుగా వ్యవహరించే బాసిజ్ మిలీషియా ఆ మహిళను అవమానించారనీ,ఆమె హిజాబ్,బట్టలను చింపేసినట్టు తెలుస్తోంది. ఈ అవమానంతో చలించిపోయిన ఆ మహిళ యూనివర్సిటీ బయట నిరసన చేపట్టింది. ఆమె నిరసనలో భాగంగా,యూనివర్సిటీ సమీప వీధుల్లో తిరుగుతూ,తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచింది.ఈ చర్యలతో ఇరాన్ అధికారులు ఆ మహిళను అరెస్టు చేశారు.

వివరాలు 

2022లో కూడా భారీ నిరసనలు 

ఇరాన్ సంప్రదాయవాద ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, ఆమె తరగతిలో "అనుచిత దుస్తులు" ధరించిందని సెక్యూరిటీ గార్డులు ఆమెను హెచ్చరించినట్టు తెలిపారు. ఆ హెచ్చరిక తర్వాత ఆ మహిళ తన దుస్తులు తీసివేసినట్టు వివరించారు. ఇరాన్‌లో మహిళలపై విధించిన ఈ దుస్తుల నియమాలకు వ్యతిరేకంగా 2022లో కూడా భారీ నిరసనలు వెల్లువెత్తాయి. మహ్సా అమిని అనే యువతి కస్టడీలో మరణించిన తరువాత, చాలా మంది మహిళలు తమ హిజాబ్‌లను విప్పి, దహనం చేస్తూ నిరసనకు దిగారు. ఈ నిరసనలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడంతో 551 మంది నిరసనకారులు మరణించారని, వేలాది మంది అరెస్టుకి గురయ్యారని సమాచారం.