US-Iran: అమెరికాకు ఇరాన్ నుంచి పెరిగిన ముప్పు.. నిఘా చీఫ్ కీలక హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు ఇరాన్ నుంచి ముప్పు రోజురోజుకూ పెరుగుతోందని అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ జే క్లేటన్ హెచ్చరించారు. అమెరికా సరిహద్దుల లోపల, వెలుపల ఇరాన్‌కు సంబంధించి ప్రాణాంతక కుట్రలు పెరుగుతున్నాయని వెల్లడించారు. బుధవారం అమెరికా ప్రతినిధుల సభకు చెందిన హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీ నిర్వహించిన విచారణలో ఆయన ఈ విషయాలను తెలిపారు. అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌కు చెందిన వ్యక్తులు దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి కుట్రలను ముందుగానే గుర్తించడం, అడ్డుకోవడం, ఎదుర్కోవడంపై తమ భద్రతా సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాయని వివరించారు.
వివరాలు
డర్టీ బాంబు దాడికి కుట్ర.. నిఘా వివరాలపై మౌనం
అమెరికాలో డర్టీ బాంబును పేల్చేందుకు ఇరాన్ కుట్ర పన్నుతోందంటూ వచ్చిన వార్తలపై విచారణ సందర్భంగా జే క్లేటన్‌ను ప్రశ్నించారు.
దీనికి ఆయన స్పందించినప్పటికీ, నిఘా సమాచారానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు.
మరోవైపు, ఇంటర్నెట్ ద్వారా తీవ్రవాద భావజాలం వ్యాప్తి చెందడం కూడా తీవ్రమైన ప్రమాదంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
విదేశాల్లోని తీవ్రవాద నెట్‌వర్క్‌లు అమెరికాలో నివసిస్తున్న వ్యక్తులపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు.
ఈ ముప్పును కేవలం ఊహాజనితంగా చూడకూడదని, అది వాస్తవంగా ఉందని స్పష్టం చేశారు.
వివరాలు
కుట్రల సమాచారం ఉన్నంత మాత్రాన దాడి చేసే సామర్థ్యం ఉన్నట్లు కాదు
అమెరికా నిఘా విభాగం హెచ్చరికల నేపథ్యంలో ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ క్రిస్టోఫర్ రైయా మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు.
దాడులకు సంబంధించిన సమాచారం అందినంత మాత్రాన వాటిని అమలు చేసే సామర్థ్యం నిందితులకు ఉందని భావించకూడదని తెలిపారు.
కొన్ని నివేదికల్లో వెల్లడైన అంశాలు కేవలం ప్రణాళికల దశలోనే ఉన్నాయని వివరించారు.
అయితే, వాటిని తేలిగ్గా తీసుకోవడం లేదని, ప్రతి సమాచారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు.
వివరాలు
టెల్ అవీవ్‌లో అమెరికా, ఇజ్రాయెల్ సైనికాధికారుల భేటీ
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్, అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ బుధవారం టెల్ అవీవ్‌లో సమావేశమయ్యారు.
ఈ భేటీలో మధ్యప్రాచ్యంలో మారుతున్న పరిస్థితులు, ప్రాంతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లపై చర్చించారు.
ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అంశాలపైనా సమాలోచనలు జరిపారు.
ఈ సమావేశంలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ చీఫ్ రోమన్ గోఫ్మన్ కూడా పాల్గొన్నారు.
వివరాలు
ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యలకు సిద్ధమవుతున్నాయా?
మరోవైపు, ఇరాన్‌పై తిరిగి సైనిక చర్యలు చేపట్టే అంశంపై అమెరికా, ఇజ్రాయెల్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఈ వారంలో ఇరాన్ బహ్రెయిన్‌పై పలుమార్లు దాడులకు ప్రయత్నించినప్పటికీ అవి విఫలమైనట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం అమెరికా ఖేష్మ్ ద్వీపంపై దాడి చేసింది. ఈ దాడిని అమెరికా వర్గాలు ఆత్మరక్షణ చర్యగా అభివర్ణించాయి.
తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.