Mojtaba Khamenei: యుద్ధానికి బ్రేక్.. కానీ ఎండ్ కాదు: మొజ్తబా ఖమేనీ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య గత 39 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. ఇరు దేశాలు రెండు వారాలపాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో తమ సైన్యాలన్నీ వెంటనే కాల్పులు నిలిపివేయాలని ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తబా ఖమేనీ ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇది యుద్ధానికి ముగింపు కాదని, చర్చలకు అవకాశం కల్పించేందుకు తీసుకున్న తాత్కాలిక నిర్ణయమని టెహ్రాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ, అప్రమత్తతను మాత్రం తగ్గించలేదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తెలిపింది. శత్రు దేశాలు అయిన అమెరికా లేదా ఇజ్రాయెల్ నుంచి చిన్న ప్రేరేపణ వచ్చినా తీవ్రంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది.
వివరాలు
అమెరికా ముందుకు 10 కీలక ప్రతిపాదనలు ఉంచిన ఇరాన్
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో అప్పటి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం ఈ యుద్ధానికి కారణమైంది. ఇప్పటివరకు యుద్ధ లక్ష్యాలు చాలా వరకు సాధించామని, శత్రువును చారిత్రక ఓటమి అంచుకు చేర్చామని ఇరాన్ పేర్కొంది. చర్చల దిశగా ముందడుగు వేస్తూ, ఇరాన్ అమెరికా ముందుకు 10 కీలక ప్రతిపాదనలు ఉంచింది. హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగించటం, ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాల నుంచి బలగాలను ఉపసంహరించటం, యుద్ధంలో జరిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించటం, అన్ని ఆంక్షలను ఎత్తివేయడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ నెల 10న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి.
వివరాలు
ఇరాన్ ప్రతిపాదనలు చర్చలకు అనుకూలం
ఇక, పాకిస్థాన్ చేసిన మధ్యవర్తిత్వాన్ని అంగీకరిస్తూ కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ ప్రతిపాదనలు చర్చలకు అనుకూలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, హర్మూజ్ జలసంధిని తక్షణమే భద్రంగా వాణిజ్యానికి అందుబాటులోకి తీసుకురావాలని ఇరాన్ అంగీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు, చర్చలు విజయవంతమై తమ డిమాండ్లు నెరవేరితేనే శాశ్వత శాంతి సాధ్యమని, లేకపోతే పోరాటం కొనసాగుతుందని ఇరాన్ తేల్చిచెప్పింది.