Trump: ఖమేనీ హతం తర్వాత సంచలన ట్విస్ట్.. ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కొత్త నాయకత్వం తనతో మాట్లాడాలని కోరుకుంటోందని, తాను కూడా అంగీకరించానని ట్రంప్ వెల్లడించారు. అట్లాంటిక్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "ఇప్పుడే వాళ్లతో మాట్లాడతాను. ముందే చేయాల్సిన పని ఇది. సులభంగా పరిష్కరించగల విషయాలను ఆలస్యంగా తీసుకొచ్చారు. చాలా ఆలస్యం చేశారు" అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించినట్లు సమాచారం. ఇటీవల అమెరికాతో చర్చలు జరిపిన ఇరాన్ ప్రతినిధుల్లో ఎక్కువమంది "భారీ దెబ్బ" కారణంగా మరణించారని ట్రంప్ ఆరోపించారు.
వివరాలు
ఖమేనీ మృతికి 40 రోజుల సంతాప దినాలు
చర్చలు ఎప్పుడు జరుగుతాయన్న ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. మరోవైపు ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు ప్రారంభించింది. ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజాని "ఎప్పుడూ చూడని శక్తితో శత్రువులకు బదులిస్తాం"అని హెచ్చరించారు. కొనసాగుతున్న ఘర్షణలో ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందగా,ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని అమెరికా సైన్యం తెలిపింది. ఖమెనీ మరణంతో ఇరాన్‌లో 40రోజుల సంతాపాన్ని ప్రకటించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనీసం 48 మంది ఇరాన్ నేతలు హతమయ్యారని ట్రంప్ చెప్పారు. సిఎన్‌బిసితో మాట్లాడిన ఆయన,"మా ఆపరేషన్లు షెడ్యూల్ కంటే ముందే సాగుతున్నాయి. ఇది కేవలం అమెరికా కోసమే కాదు,ప్రపంచం కోసం చేస్తున్న పని" అని పేర్కొన్నారు.