Us-Iran War: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల దాడి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతుండటంతో గల్ఫ్ ప్రాంత దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికా చేపట్టిన తాజా వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. బహ్రెయిన్, కువైట్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించింది.
వివరాలు
85 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యం
హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా.. ఇరాన్‌కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా కేంద్రాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ చర్యలను తీవ్రంగా ఖండించిన ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC).. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ప్రతీకార చర్యగా బహ్రెయిన్‌లోని అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్, కువైట్‌లోని అలీ అల్ సలేమ్ ఎయిర్ బేస్‌తో పాటు మొత్తం 85 కీలక అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు నిర్వహించినట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది. అంతేకాకుండా బుషెహర్ ప్రాంతంలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఎంక్యూ-9 (MQ-9) డ్రోన్‌ను కూల్చివేసినట్లు కూడా ప్రకటించింది.
వివరాలు
'బెదిరింపులకు ఇక తలొగ్గం'.. ఇరాన్ స్పష్టీకరణ
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా స్పందించిన ఐఆర్‌జీసీ.. తమ దేశ చారిత్రక కార్యక్రమాన్ని మరుగున పడేయడానికి అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘాలిబఫ్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. అమెరికా బెదిరింపులు, ఒత్తిళ్లకు ఇకపై ఇరాన్ తలొగ్గదని స్పష్టం చేశారు. అమెరికా అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ.. ఎలాంటి ఒత్తిడి వచ్చినా టెహ్రాన్ తన వైఖరిని మార్చబోదని పేర్కొన్నారు.
వివరాలు
80కిపైగా లక్ష్యాలపై దాడులు చేశాం: అమెరికా
మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) కూడా ఇరాన్‌పై నిర్వహించిన ఆపరేషన్ వివరాలను వెల్లడించింది. ఈ దఫా చేపట్టిన చర్యలో 80కిపైగా కీలక లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు తెలిపింది. టెహ్రాన్ కమాండ్ అండ్ కంట్రోల్ నెట్‌వర్క్‌లు, తీరప్రాంత రాడార్ కేంద్రాలు, యాంటీ-షిప్ క్షిపణి వ్యవస్థలు, గగనతల రక్షణ సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో ఐఆర్‌జీసీకి చెందిన సుమారు 60 చిన్న పడవలు కూడా ధ్వంసమైనట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం నాటో శిఖరాగ్ర సదస్సు నిమిత్తం తుర్కియేలో ఉన్నారని, అక్కడి నుంచే ఇరాన్‌పై తాజా దాడులకు ఆదేశాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.