Iran: ఇరాన్‌లో అధికార మార్పిడికి సంకేతాలు?.. ఐఆర్‌జీసీ పట్టు పెరుగుతోందా?
ఈ వార్తాకథనం ఏంటి
వివాదాలు, రాజకీయ ఉద్రిక్తతలకు తరచూ కేంద్రంగా నిలిచే ఇరాన్‌లో తాజాగా మరో కీలక పరిణామం చర్చనీయాంశంగా మారింది. దేశంలోని అత్యున్నత నాయకత్వాన్ని పక్కనబెట్టి, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) క్రమంగా పూర్తి అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంటోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికైన నాయకులు అధికారిక కార్యాలయాలకే పరిమితం కావడం, ప్రభుత్వ నిర్ణయాలపై ఐఆర్‌జీసీ ప్రభావం పెరగడం, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌ను రాజకీయంగా ఏకాకిని చేయడం వంటి పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
వివరాలు
పాకిస్థాన్ తరహా పరిస్థితులా?
పాకిస్థాన్‌లో ఎన్నికైన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, కీలక నిర్ణయాలపై సైన్యం ప్రభావమే ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. దశాబ్దాలుగా అక్కడ సైన్యం రాజకీయ వ్యవస్థపై గణనీయమైన పట్టు కొనసాగిస్తోంది. కొన్ని సందర్భాల్లో నేరుగా సైనికాధికారులే దేశాధ్యక్షులుగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఇరాన్‌లోనూ అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయా అనే చర్చ జరుగుతోంది.
వివరాలు
ఇరాన్ రాజ్యాంగం ఏమంటోంది?
1979లో అమలులోకి వచ్చిన ఇరాన్ రాజ్యాంగం ప్రకారం దేశంలోని అత్యున్నత అధికారం సుప్రీం లీడర్ చేతుల్లో ఉంటుంది. కీలక సైనికాధికారులు, ఐఆర్‌జీసీ కమాండర్ల నియామక బాధ్యత కూడా ఆయనదే. అధ్యక్షుడు మాత్రం రోజువారీ పాలన, పరిపాలనా వ్యవహారాలను నిర్వహిస్తారు. అయితే సుప్రీం లీడర్, అధ్యక్షుడు, ఐఆర్‌జీసీ మధ్య సంబంధాలు ఎప్పటికప్పుడు స్థిరంగా ఉండవు. ముఖ్యంగా అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఈ పరిస్థితులను ఐఆర్‌జీసీ తనకు అనుకూలంగా మలుచుకుంటోందనే కథనాలు వెలువడుతున్నాయి. అధ్యక్షుడు పెజెష్కియాన్, ఐఆర్‌జీసీ మధ్య అధికార పరిధుల విషయంలో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇరాన్‌కు చెందిన అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ప్రభుత్వ కార్యకలాపాలపై ఇప్పటికే ఐఆర్‌జీసీ ప్రభావం పెరిగింది. అధ్యక్షుడిని పరిమిత పరిధిలో ఉంచినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
వివరాలు
కేవలం సైనిక బలగమే కాదు..
ఐఆర్‌జీసీ కేవలం సైనిక సంస్థ మాత్రమే కాదు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలోనూ అది కీలక పాత్ర పోషిస్తోంది. నిర్మాణ రంగం, చమురు, గ్యాస్, రవాణా, టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, దిగుమతులు, ఎగుమతులు వంటి అనేక రంగాల్లో దాని ఆధిపత్యం ఉంది. తన ఆధ్వర్యంలో అనుబంధ సంస్థలు, ఫౌండేషన్లు, వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకున్న ఐఆర్‌జీసీ భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. దాని నియంత్రణలో పనిచేసే 'ఖాతమ్ అల్-అంబియా' ఇంజినీరింగ్ సంస్థ అత్యంత కీలకమైనది. రిఫైనరీలు, ఆనకట్టలు, రైల్వే మార్గాలు, పైపులైన్లు వంటి భారీ ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఈ వ్యవస్థ కొంతవరకు పాకిస్థాన్‌లో కనిపించే సైనిక-ఆర్థిక నమూనాను గుర్తు చేస్తోంది.
వివరాలు
ఆంక్షలతో మరింత బలపడిన ఐఆర్‌జీసీ
ఇరాన్‌పై పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలు కూడా ఐఆర్‌జీసీకి పరోక్షంగా లాభం చేకూర్చినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. అధికారిక వాణిజ్య మార్గాలు దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడంలో ఆ సంస్థ కీలక పాత్ర పోషించింది. ఇరాన్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 30 నుంచి 50 శాతం వరకు ఐఆర్‌జీసీ అనుబంధ సంస్థల ప్రభావం ఉందని అంచనాలు ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో 20 నుంచి 30 శాతం వరకు దాని నియంత్రణలోనే ఉందని సమాచారం.
వివరాలు
రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభావం
ఐఆర్‌జీసీ నుంచి పదవీ విరమణ చేసిన అధికారులు అనంతరం క్యాబినెట్, న్యాయ వ్యవస్థ, భద్రతా విభాగాలు, ప్రాంతీయ పరిపాలనా వ్యవస్థల్లో కీలక స్థానాలు దక్కించుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగంపై వారి ప్రభావం మరింత పెరుగుతోంది. ఖమేనీ మరణం తర్వాత పరిస్థితి అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో సీనియర్ ఖమేనీ మరణించిన తర్వాత ఇరాన్‌లో ఐఆర్‌జీసీ ప్రభావం మరింత పెరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి రాజకీయ, పరిపాలనా వ్యవస్థపై పూర్తి పట్టు లేకపోవడం కూడా ఐఆర్‌జీసీకి అనుకూలంగా మారినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కీలక నియామకాలపై ఆ సంస్థ ప్రభావం పెరిగిందని, అధికార కేంద్రానికి చేరుకునే మార్గాలపై కూడా నియంత్రణ సాధిస్తోందని సమాచారం.
వివరాలు
మొజ్తాబా ఖమేనీ ఎక్కడ?
అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం రహస్య ప్రదేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో నేరుగా భేటీ అయ్యే అవకాశం అత్యున్నత అధికారులకు కూడా లేదని, మధ్యవర్తులు లేదా దూతల ద్వారా మాత్రమే సంబంధాలు కొనసాగుతున్నాయని కథనాలు చెబుతున్నాయి. ఖమేనీ అధికారులతో నేరుగా సమావేశాలు నిర్వహించలేకపోవడం,ప్రత్యక్ష ఆదేశాలు ఇవ్వలేకపోవడం వంటి పరిస్థితులు ఐఆర్‌జీసీకి మరింత అవకాశంగా మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
సైనిక నియంతృత్వం వైపేనా?
ప్రస్తుతం వెలువడుతున్న సమాచారం నిజమైతే, ఇరాన్‌లో అధికార సమీకరణాలు గణనీయంగా మారే అవకాశం ఉంది. సుప్రీం లీడర్ పదవి కొనసాగినా, అసలు అధికారం ఐఆర్‌జీసీ చేతుల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు. అలాంటి పరిణామం జరిగితే పాకిస్థాన్‌లో కనిపించే సైన్యాధిపత్య నమూనాకు దగ్గరగా ఇరాన్ వ్యవస్థ మారే అవకాశముంది. ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే. మొజ్తాబా ఖమేనీని పక్కనబెట్టి ఐఆర్‌జీసీ పూర్తిస్థాయి అధికారాన్ని చేపడితే, ఇరాన్‌కు తదుపరి ప్రభావవంతమైన నాయకుడు ఎవరు?