LOADING...
US, Iran Talks: ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు? కీలక పరిణామాలు వెలుగులోకి..
ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు? కీలక పరిణామాలు వెలుగులోకి..

US, Iran Talks: ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు? కీలక పరిణామాలు వెలుగులోకి..

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 24, 2026
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య నేరుగా చర్చలకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కావచ్చని వార్తలు వెలువడుతున్నాయి. వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపిన ప్రకారం, ఈ వారం లోపలే ఈ సమావేశం జరగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అధికారులు సంకేతాలు ఇచ్చారు. ఇటీవల ఇరాన్ ఎనర్జీ మౌలిక వసతులపై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఈ పరిణామాలకు దారితీసింది.

వివరాలు 

అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ దేశాలు మధ్యవర్తిత్వం చేస్తూ అమెరికా-ఇరాన్ నేతలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి రహస్యంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి ప్రకారం, ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ ఉన్నతాధికారుల మధ్య సమావేశం నిర్వహించేందుకు సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొనే అవకాశముందని కూడా ఆయన తెలిపారు. అయితే, టర్కీ, ఈజిప్ట్, పాకిస్థాన్ దేశాల మధ్యవర్తిత్వంపై ఇజ్రాయెల్‌కు ముందే సమాచారం ఉన్నప్పటికీ, చర్చలు ముందుకు సాగుతున్నాయన్న ట్రంప్ వ్యాఖ్యలు, పలు అంశాల్లో ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయన్న ప్రకటనలు వారికి ఆశ్చర్యం కలిగించాయి.

వివరాలు 

ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన పాకిస్థాన్ ప్రధాని

ఇదిలా ఉండగా, పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రాంతంలో శాంతి పునరుద్ధరణకు పాకిస్థాన్ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. గత నెలలో రంజాన్, ఈద్ సందర్భాల్లో కూడా ఈ ఇద్దరు నేతలు పలుమార్లు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. యుద్ధానికి ముగింపు కావాలని ఇరువురు నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ కూడా ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడినట్లు సమాచారం. అలాగే ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కూడా చర్చలు జరిపినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది.

Advertisement

వివరాలు 

మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై రహస్య చర్చలు 

ఇటీవలి రోజుల్లో దౌత్యపరమైన చర్చలు వేగంగా సాగుతున్నాయి. టర్కీ, ఈజిప్ట్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రులు వేర్వేరుగా వైట్ హౌస్ ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్‌తో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇజ్రాయెల్ మీడియా నివేదికల ప్రకారం, స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్‌లు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ ఘాలిబాఫ్‌తో కూడా సంప్రదింపులు జరిపారు. ఈ సంఘర్షణలో కీలక నిర్ణయాధికారిగా ఆయన ఎదిగినట్లు భావిస్తున్నారు. ఈ చర్చలకు సమీపంగా ఉన్న ఒక వర్గం ప్రకారం, మధ్యవర్తిత్వం కొనసాగుతూ ముందుకు సాగుతోందని, యుద్ధానికి ముగింపు పలకడం, వివాదాస్పద అంశాల పరిష్కారంపైనే ప్రధాన దృష్టి ఉందని తెలిపింది.

Advertisement

వివరాలు 

అమెరికాతో చర్చలు లేవన్న ఇరాన్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం చర్చలు బాగా జరుగుగుతున్నాయని చెప్పారు. "మా మధ్య బలమైన చర్చలు జరిగాయి. పలు కీలక అంశాల్లో ఏకాభిప్రాయం వచ్చింది" అని ఆయన తెలిపారు. దౌత్య చర్చలకు అవకాశం ఇవ్వడానికి ఐదు రోజుల పాటు సైనిక చర్యలను నిలిపివేసినట్లు కూడా వెల్లడించారు. "ఈ ఐదు రోజులు కీలకం. పరిస్థితి బాగుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. లేదంటే మళ్లీ దాడులు కొనసాగుతాయి" అని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా, చర్చల కోసం ఇరాన్ ముందుకు వచ్చిందని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. గత 24 రోజుల్లో అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.

Advertisement