Netanyahu: ఇరాన్ చమురు, అణు స్థావరాలపై దాడి చేయబోం :అమెరికాకి ఇజ్రాయెల్ హామీ..!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరాన్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాని అణుస్థావరాలను ధ్వంసం చేస్తుందా అనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు, చమురు స్థావరాలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నట్లు సమాచారం వస్తోంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడిన సమయంలో వెల్లడించినట్లు అమెరికాకు చెందిన పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇంధన ధరలు పెరిగే అవకాశం
ఇటీవల జో బైడెన్,ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్‌లో సంభాషించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో, ఇరువురు నేతలు ఇరాన్‌పై ప్రతీకార దాడుల గురించి చర్చించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇరాన్ చమురు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడితే ఇంధన ధరలు పెరిగే అవకాశముందని పలువురు విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఇది అమెరికా ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కావున ఇజ్రాయెల్ ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని నెతన్యాహుకు బైడెన్ సూచించారు. ఆయన సూచనల ప్రకారం, ఇరాన్ చమురు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులను విరమించుకుంది.
యూఎస్ ఆయుధాలతోనే ఇజ్రాయెల్ పోరాడుతుంది
'మేము అమెరికన్ ప్రభుత్వ ఆలోచనలు వింటాము. కానీ, ఇజ్రాయెల్ దళాల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం' అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. నెతన్యాహుకు యూఎస్ విజ్ఞప్తులు ఇజ్రాయెల్‌లోని ప్రజల డిమాండ్‌తో సమానమని ఇజ్రాయెల్‌కు చెందిన ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ తెలిపారు. అదేవిధంగా, యూఎస్ ఆయుధాలతోనే ఇజ్రాయెల్ పోరాడుతుందని స్పష్టంగా చెప్పారు. అయితే, ఈ అంశాలపై వైట్‌హౌస్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం
ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. దాదాపు 180 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్‌కు చెందిన అణు, చమురు స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేయడంపై చర్చలు జరుపుతుందనే కథనాలు వెలువడ్డాయి. అయితే, అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇరాన్ అణుస్థావరాలపై కాకుండా ప్రత్యామ్నాయంగా దాడి చేయాలని బహిరంగంగానే ఇజ్రాయెల్‌కు సూచించారు.