గాజాలో శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. హమాస్ టాప్ కమాండర్, ఉగ్రవాదులు హతం
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలై నెల రోజులు కావస్తోంది. యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రమయ్యాయి. హమాస్ ఉగ్రవాదులే ఉన్నారన్న లక్ష్యంతో తాజాగా ఉత్తర గాజాలోని శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకపడింది. గాజాలోనే ఇది అతిపెద్ద శరణార్థి శిబిరం. ఈ దాడిలో హమాస్ సెంట్రల్ జబాలియా బెటాలియన్ కమాండర్ ఇబ్రహీం బియారీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ట్విట్టర్‌లో పేర్కొంది. అంతేకాదు, భారీ సంఖ్యలో హమాస్ మిలిటెంట్ల అంతమొందించినట్లు చెప్పింది. ఇదే సమయంలో గాజాలోని సామాన్య ప్రజలు ఉత్తర గాజాను ఖాళీ చేయాలని, దక్షణ గాజాకు వెళ్లిపోవాలని పిలుపునిచ్చింది.
బియారీ ఉన్నాడన్న పక్కా సమాచారంతోనే ఇజ్రాయెల్ దాడి
ఇజ్రాయెల్ వైమానిక దాడులపై గాజాలోని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 50 మంది మరణించారని తెలిపింది. 150 మంది గాయపడ్డారని వివరించింది. గాయపడిన వారికి చికిత్స చేయడానికి, ఆసుపత్రి కారిడార్‌లలో ఆపరేటింగ్ గదులను ఏర్పాటు చేయడానికి వైద్య సిబ్బంది కష్టపడుతున్నారని హమాస్ స్పష్టం చేసింది. గాజాలోని శరణార్థి శిబిరంలో హమాస్ కమాండర్ బియారీ ఉన్నారన్న పక్కా సమాచారంతోనే తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ తెలిపారు. ప్రజల వెనుక దాక్కోవడం వారికి అలవాటే అన్నారు. ఈ దాడిలో సామాన్య పౌరులు చనిపోయవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.