Tehran's Gandhi Hospital: టెహ్రాన్‌లోని గాంధీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ బాంబు దాడి
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడుల ప్రభావం రాజధాని టెహ్రాన్‌పైనా తీవ్రంగా కనిపిస్తోంది. ఉత్తర టెహ్రాన్‌లో ఉన్న గాంధీ ఆసుపత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పూర్తిగా దెబ్బతింది. ఈ దాడుల నేపథ్యంలో అక్కడ ఉన్న రోగులను అత్యవసరంగా ఇతర ప్రాంతాలకు తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ స్పందించారు. ఆసుపత్రులపై దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం అని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య సదుపాయాలు, వైద్య కేంద్రాలను రక్షించేందుకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని, ఇలాంటి దాడులను అడ్డుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
వివరాలు
100 యుద్ధ విమానాలతో ప్రభుత్వ భవనాలు లక్ష్యంగా దాడులు
గాంధీ ఆసుపత్రిని పూర్తిగా ఖాళీ చేస్తున్నామని, అదే సమయంలో మరో మూడు ఆసుపత్రులు కూడా దాడులకు గురయ్యాయని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి వెల్లడించారు. దాడుల వల్ల వైద్య సేవలు అంతరాయం కలుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టెహ్రాన్‌లోని గాంధీ ఆసుపత్రి లక్ష్యంగా మారడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ఇదే ఆసుపత్రిపై దాడి జరిగిన విషయం గుర్తుంచుకోవాల్సిందే. ఇదిలా ఉండగా, తమ దాడులు ఇరాన్‌కు చెందిన అణు,సైనిక స్థావరాలపై మాత్రమే కేంద్రీకృతమయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. టెహ్రాన్‌లోని కొన్ని ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని ఏకకాలంలో సుమారు 100 యుద్ధ విమానాలతో దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది.