Israel Elections 2026: ఇజ్రాయెల్ ఎన్నికలు: దేశమంతా ఒకే నియోజకవర్గం.. ఓటింగ్ విధానం ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 27న జాతీయ ఎన్నికలు జరగనున్నాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న తొలి జాతీయ ఎన్నికలు కావడంతో వీటికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజాపై సైనిక చర్యలు చేపట్టింది. అనంతరం లెబనాన్‌తో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామాలు చివరకు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేసే పరిస్థితులకు దారితీశాయి. ఈ నేపథ్యంలో దేశ భద్రత, ఆర్థిక పరిస్థితులు ఎన్నికల్లో కీలక అంశాలుగా మారాయి. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. మాజీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చీఫ్ గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని యాషర్ పార్టీ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది.
వివరాలు
భారత్‌కు భిన్నంగా ఎన్నికల విధానం
ఎన్నికలకు ముందు టెల్ అవీవ్‌లో నెతన్యాహుకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసన చేపట్టారు.
2023 హమాస్ దాడికి కారణమైన భద్రతా వైఫల్యాలపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇజ్రాయెల్ ఎన్నికల విధానం భారత్‌కు భిన్నంగా ఉంటుంది.
భారత్‌లో నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఎన్నుకుంటే,ఇజ్రాయెల్‌లో దేశమంతటినీ ఒకే నియోజకవర్గంగా పరిగణిస్తారు.
ఓటర్లు వ్యక్తులకు కాకుండా పార్టీలకు ఓటేస్తారు. ప్రతి పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి పార్లమెంటు సీట్లు కేటాయిస్తారు.
ఇజ్రాయెల్ పార్లమెంటును నెస్సెట్ అంటారు. ఇందులో మొత్తం 120 సీట్లు ఉన్నాయి.
కనీసం 3.25 శాతం ఓట్లు సాధించిన పార్టీలకే ప్రాతినిధ్యం లభిస్తుంది.
ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఒక పార్టీ లేదా కూటమి కనీసం 61 సీట్లు సాధించాలి.
వివరాలు
పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు
ఇప్పటివరకు ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అక్కడ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడ్డాయి.
పోలింగ్ రోజున ఓటర్లు హిబ్రూ అక్షరాల్లో పార్టీ పేరున్న కాగితపు స్లిప్‌ను ఎంచుకుని, ఎన్వలప్‌లో పెట్టి బ్యాలెట్ బాక్స్‌లో వేస్తారు.
పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
అక్టోబర్ 28 తెల్లవారుజాముకల్లా ఫలితాలపై ప్రాథమిక అంచనా వస్తుంది. అధికారిక ఫలితాలను నవంబర్ 4న ప్రకటించనున్నారు.
అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అధ్యక్షుడు ఒక నేతను ఆహ్వానిస్తారు. ఆయనకు 28 రోజుల గడువు ఇస్తారు.
అవసరమైతే మరో 14 రోజులు పొడిగిస్తారు. అప్పటికీ ప్రభుత్వం ఏర్పడకపోతే మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది.
వివరాలు
అరబ్ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకం
తుది ఒపీనియన్ పోల్స్ ప్రకారం, ఐసెన్‌కోట్ యాషర్ పార్టీ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు అంచనాలున్నాయి.
నెతన్యాహు లికుడ్ పార్టీకి సుమారు 50 సీట్లు, ప్రతిపక్షాలకు 52-56 సీట్లు వచ్చే అవకాశం ఉందని పోల్స్ సూచిస్తున్నాయి.
14-16 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్న అరబ్ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారవచ్చు.
ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రత, అత్యంత సంప్రదాయవాద యూదులను సైన్యంలో చేర్చుకోవాలా వద్దా అనే అంశాలు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నాయి.
వివరాలు
ఇజ్రాయెల్ కీలక వ్యూహాత్మక భాగస్వామిగా భారత్
ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం మారితే విదేశాంగ విధానంలో కొన్ని మార్పులు రావొచ్చు.
అయితే భారత్‌తో సంబంధాలు మాత్రం సానుకూలంగానే కొనసాగే అవకాశముంది.
భారత్‌ను ఇజ్రాయెల్ కీలక వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణిస్తోంది. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య బలమైన సహకారం ఉంది.
ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్టులో భారత పెట్టుబడులు, ఇండియా-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్‌లో ఆ పోర్టు ప్రాధాన్యం కూడా ఇరు దేశాల సంబంధాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.