Muhammed Odeh: అక్టోబరు 7 దాడుల సూత్రధారి హతం.. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
హమాస్ (Hamas) జరిపిన 'అక్టోబరు 7' నాటి నరమేధంలో పాల్గొన్న వారిని ఇజ్రాయెల్ ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఆ దాడుల ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన మహమ్మద్ ఒడెహ్‌ను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి కట్జ్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. మంగళవారం రాత్రి గాజా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించగా, మరో 12 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో అక్టోబరు 7 దాడులకు కీలకంగా వ్యవహరించిన మహమ్మద్ ఒడెహ్ కూడా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
వివరాలు
మిలిటరీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన 11 రోజుల్లోనే..
ఇటీవల జరిగిన దాడుల్లో హమాస్ అగ్రనేత ఎజ్జెదిన్ అల్ హద్దాద్ మరణించడంతో,ఆయన స్థానంలో వారం క్రితమే ఒడెహ్ బాధ్యతలు చేపట్టారు. అయితే,కొద్దిరోజులకే ఆయనను కూడా ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ప్రధాని నెతన్యాహు,రక్షణ మంత్రి కట్జ్ సామాజిక మాధ్యమ వేదిక ద్వారా ఒడెహ్ మరణాన్ని ధ్రువీకరించారు. అక్టోబరు 7 ఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ వేటాడి అంతమొందిస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే,ఒడెహ్ మరణంపై హమాస్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 2023 అక్టోబరు 7న హమాస్ జరిపిన దాడుల్లో సుమారు 1,200 మందికి పైగా మరణించారు.అలాగే 251 మందిని బంధించి గాజాకు తీసుకెళ్లారు. ఈ దాడుల్లో పాల్గొన్న వారిని మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ ఆపరేషన్ ప్రారంభించింది