LOADING...
Israel-Pakistan: ఇజ్రాయెల్‌ను క్యాన్సర్ దేశంగా అభివర్ణించిన పాక్ మంత్రి.. తీవ్రంగా స్పందించిన నేతన్యాహు
తీవ్రంగా స్పందించిన నేతన్యాహు

Israel-Pakistan: ఇజ్రాయెల్‌ను క్యాన్సర్ దేశంగా అభివర్ణించిన పాక్ మంత్రి.. తీవ్రంగా స్పందించిన నేతన్యాహు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతిచర్చలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్-పాకిస్థాన్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. లెబనాన్‌లో ఇజ్రాయెల్ అమానుష చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సామాజిక మాధ్యమంలో చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి. ఖవాజాఆసిఫ్ తన పోస్టులో ఇజ్రాయెల్‌ను మానవాళికి శాపంగా అభివర్ణించారు. ఇస్లామాబాద్‌లో శాంతిచర్చలు జరుగుతున్న సమయంలో లెబనాన్‌లో అమాయక పౌరులపై దాడులు కొనసాగుతున్నాయని విమర్శించారు. ముందుగా గాజాలో,తర్వాత ఇరాన్‌పై, ఇప్పుడు లెబనాన్‌లో రక్తపాతం కొనసాగుతోందని పేర్కొన్నారు. అలాగే పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ దేశం ఏర్పాటుపై తీవ్ర విమర్శలు చేస్తూ కఠిన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలో ఇజ్రాయెల్‌ను క్యాన్సర్‌లాంటి దేశంగా పేర్కొనడం మరింత వివాదానికి దారి తీసింది.

వివరాలు 

ఇస్లామాబాద్‌లో చర్చలు

ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం తీవ్రంగా స్పందించింది. తమ దేశ వినాశనాన్ని కోరుతూ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని తెలిపింది. శాంతి చర్చల్లో తటస్థంగా వ్యవహరిస్తున్నామని చెప్పే దేశం నుంచి ఇలాంటి ప్రకటనలు రావడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇదే విషయంపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సర్ కూడా తీవ్రంగా ఖండించారు. తమ దేశాన్ని క్యాన్సర్‌తో పోల్చడం అనేది నాశనానికి పిలుపునివ్వడమేనని హెచ్చరించారు. ఇదిలా ఉండగా అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీన్ని శాశ్వత శాంతిగా మార్చేందుకు ఇస్లామాబాద్‌లో తదుపరి చర్చలు జరగనున్నాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్-పాక్ మధ్య ఈ దౌత్య వివాదం ఉత్పన్నం కావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement