LOADING...
Israel: నెతన్యాహు ఆదేశంతో గాజాపై మళ్లీ ఇజ్రాయెల్‌ దాడులు
నెతన్యాహు ఆదేశంతో గాజాపై మళ్లీ ఇజ్రాయెల్‌ దాడులు

Israel: నెతన్యాహు ఆదేశంతో గాజాపై మళ్లీ ఇజ్రాయెల్‌ దాడులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన శాంతి ఒప్పందానికి తూట్లు పడ్డాయి. మంగళవారం గాజాపై తీవ్ర సైనిక దాడులు చేపట్టాలని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు తన సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల అనంతరం రాత్రికల్లా గాజాలో పలుచోట్ల పేలుళ్లతో భయానక వాతావరణం నెలకొంది. బాంబుల శబ్దాలు మార్మోగాయి. దక్షిణ గాజా ప్రాంతంలో తమ బలగాలపై హమాస్‌ కాల్పులు జరిపిందని, దానికి ప్రతిస్పందనగానే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని నెతన్యాహు తెలిపారు. మరోవైపు, హమాస్‌ ఇజ్రాయెల్‌ వైఖరిని తీవ్రంగా ఖండించింది. మృతదేహాల అప్పగింతను ఆలస్యం చేస్తామని హెచ్చరించింది.

వివరాలు 

భద్రతాధికారులతో నెతన్యాహు కీలక సమావేశం

ఇంకా 13 మృతదేహాలను అప్పగించాల్సి ఉందని పేర్కొంది. సోమవారం రాత్రి హమాస్‌ అప్పగించిన ఒక బందీ మృత శరీర భాగాలు, రెండు సంవత్సరాల క్రితం గాజాలో ఇజ్రాయెల్‌ బలగాలు స్వాధీనం చేసుకున్న మృతుడివేనని నెతన్యాహు ముందు రోజు ఆరోపించారు. ఇది కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. దీనిపై తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవడానికి నెతన్యాహు మంగళవారం భద్రతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ పరిణామాల మధ్య ఇజ్రాయెల్‌ మీడియా, రాబోయే దాడులపై విశ్లేషణ కథనాలను ప్రచురించింది. హమాస్‌ నేతలపై ప్రత్యేకంగా వైమానిక దాడులు జరిగే అవకాశం ఉందని వెల్లడించింది. అంచనాల ప్రకారం, గాజాలో ఆ దాడులు ప్రారంభమయ్యాయి.