Israel: ఉగ్రదాడులకు ఇక మరణశిక్షే.. ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఉగ్రదాడులకు పాల్పడే పాలస్తీనీయులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రకార్యకలాపాల్లో పాల్గొన్న వారికి మరణశిక్ష విధించేలా కొత్త చట్టాన్ని ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన క్నెసెట్ ఆమోదించింది. దాదాపు 12 గంటలపాటు సాగిన చర్చల అనంతరం ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం, ఉగ్రదాడుల్లో పాల్గొన్న వారిపై మరణశిక్ష విధించే అధికారం కోర్టులకు ఉంటుంది. ఒకసారి శిక్ష ఖరారైన తర్వాత 90 రోజుల్లోపు దానిని అమలు చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో న్యాయస్థానం నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుంది.
వివరాలు
అమెరికా మద్దతు
ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతోనే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ముఖ్యంగా 2023 అక్టోబర్ 7న హమాస్ నిర్వహించిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆ ఘటనలో పాల్గొన్న నిందితులకు ఈ కొత్త చట్టం వర్తించదని స్పష్టం చేశారు. ఇంకా ఒక ముఖ్య అంశం ఏమిటంటే,ఇజ్రాయెల్ పౌరులు,అక్కడ నివసించే వారికి ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. అయినప్పటికీ, ప్రత్యేక నిబంధనల ప్రకారం ఉగ్రకార్యకలాపాల ద్వారా ఎవరి మరణానికి కారణమైన ఇజ్రాయెలీలపైనా ఈ చట్టం అమలవుతుందని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ తీసుకున్న ఈ నిర్ణయానికి అమెరికా మద్దతు తెలిపింది. తమ దేశానికి అనుగుణంగా చట్టాలు చేసుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని అమెరికా పేర్కొంది.
వివరాలు
వార్షిక బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్
దీర్ఘకాల సమావేశాల అనంతరం ఇజ్రాయెల్ పార్లమెంట్ వార్షిక బడ్జెట్‌ను కూడా ఆమోదించింది. దీంతో ఆ దేశంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు తగ్గిపోయాయి. సాధారణంగా ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ పదవీకాలం పూర్తికాకముందే ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వం నాలుగేళ్ల పదవీకాలాన్ని మరికొన్ని నెలల్లో పూర్తి చేయనుంది. అక్టోబర్ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉండగా, ఈ సమయంలో బడ్జెట్ ఆమోదం పొందడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.