యుద్దం ఆపేది లేదు.. గెలిచే వరకు పోరాటం ఆగదు: ఇజ్రాయెల్
హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఒక వైపు వైమానిక దాడులు చేస్తూనే, మరోవైపు గ్రౌండ్ ఆపరేషన్ చేపడుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో సామాన్య పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో కాల్పుల విరమణ చేయాలని ఆ దేశంపై అంతర్జాతీయ ఒత్తడి పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి పిలుపునిచ్చింది. కానీ, కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ససేమీరా అంటోంది. హమాస్‌పై యుద్ధాన్ని ఆపేది లేదని, గెలిచే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాల్పుల విరమణకు ఒప్పుకుంటే, తాము హమాస్‌కు లొంగిపోయినట్లేనని, అది జరగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖరాఖండిగా చెప్పారు. ఇజ్రాయెల్ మిత్రదేశం అమెరికా కూడా కాల్పుల విరమణపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
బంధీలే.. హమాస్‌కు రక్షణ కవచం
దాదాపు 230మంది ఇజ్రాయిలీలు, విదేశీ పౌరులు గాజా స్ట్రిప్‌లో ప్రస్తుతం హమాస్ చేతిలో బంధీలుగా ఉన్నారు. ఈ క్రమంలో వారిని విడిపించేందుకు నెతన్యాహు ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంధీలుగా ఉన్నవారే.. హమాస్‌కు రక్షణ కవచం అని చెప్పాలి. గతంలో కూడా బంధీలను విడిపించుకోవాడనికి హమాస్‌తో ఇజ్రాయెల్ చర్చలు జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని హమాస్ భావిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. హమాస్ మిలిటెంట్లు ఇంతకుముందు ఇద్దరు యూఎస్ పౌరులతో సహా నలుగురు బంధీలను విడుదల చేశారు. గాజాలో హమాస్ చేతిలో బంధీలుగా ఉన్నమిగతా వారిని విడిపించాలంటే.. దానికి బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేయాలని హమాస్ డిమాండ్ చేస్తోంది. దీనికి ఇజ్రాయెల్ ఒప్పుకోవడం లేదు.