Loading...
Israel Election: ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కోట్‌కు అవకాశం.. నెతన్యాహుకు చెక్ పడేనా?
నెతన్యాహుకు చెక్ పడేనా?

Israel Election: ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కోట్‌కు అవకాశం.. నెతన్యాహుకు చెక్ పడేనా?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2026
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన దాదాపు రెండు వారాల తర్వాత ప్రతిపక్ష నేత, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మాజీ చీఫ్ గాడి ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లభించింది. ఈ నెల 8న అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఆయనను అధికారికంగా ఆహ్వానించారు. దీంతో ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అధికారానికి దూరం చేసే అవకాశం ఏర్పడింది. అయితే పార్లమెంట్‌లో మెజారిటీ సాధించడం ఐసెన్‌కోట్‌కు సవాల్‌గా మారింది.

వివరాలు 

ఎవరికీ దక్కని స్పష్టమైన మెజారిటీ

అక్టోబర్ 27న ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్‌లోని 120 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61స్థానాలు ఏ కూటమికీ దక్కలేదు.

నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ 27స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది.

ఐసెన్‌కోట్‌కు చెందిన యాషర్ పార్టీ 21స్థానాలు గెలుచుకుంది. నెతన్యాహు కూటమికి 53,ఐసెన్‌కోట్ ప్రతిపక్ష కూటమికి 48 స్థానాలు లభించాయి.

అరబ్ పార్టీలైన జాయింట్ లిస్ట్‌కు 11,రామ్ పార్టీకి 8 స్థానాలు వచ్చాయి.

అయితే అధ్యక్షుడితో జరిగిన సంప్రదింపుల్లో ఐసెన్‌కోట్‌కు 67 మంది ఎంపీలు మద్దతు ప్రకటించగా, నెతన్యాహుకు 46 మంది మద్దతిచ్చారు.

ఏడుగురు సభ్యులున్న పార్టీ ఎవరినీ సిఫారసు చేయలేదు. అరబ్ పార్టీల మద్దతుతో ఐసెన్‌కోట్‌కు అవకాశం దక్కినా, విశ్వాస పరీక్షలో అదే మద్దతు కొనసాగుతుందన్న హామీ లేదు.

వివరాలు 

మెజారిటీ కోసం రెండు మార్గాలు

ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కోట్‌కు తొలుత 28 రోజుల గడువు ఉంటుంది.

అవసరమైతే అధ్యక్షుడు మరో 14 రోజులు పొడిగించవచ్చు. ప్రస్తుతం 48 స్థానాలున్న ఆయన కూటమికి మరో 13 మంది మద్దతు అవసరం.

మొదటి మార్గం 19 స్థానాలున్న అరబ్ పార్టీల సహకారం తీసుకోవడం. అయితే కూటమిలోని యిస్రాయెల్ బెటెనూ నేత అవిగ్డోర్ లీబర్‌మన్ దీనిని వ్యతిరేకిస్తున్నారు.

విశ్వాస పరీక్షలో అరబ్ పార్టీల మద్దతు తీసుకోవడాన్ని, వాటి గైర్హాజరుతో ప్రయోజనం పొందడాన్ని కూడా ఆయన అంగీకరించడం లేదు.

రెండో మార్గం అల్ట్రా ఆర్థడాక్స్ హరేడీ పార్టీల మద్దతు సాధించడం. షాస్‌కు 6, యునైటెడ్ తోరా జుడాయిజానికి 7 స్థానాలున్నాయి.

ఈ పార్టీలు గతంలో నెతన్యాహుకు మిత్రపక్షాలుగా ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

ప్రభుత్వ ఏర్పాటు విఫలమైతే?

హరేడీ యువకులకు తప్పనిసరి సైనిక సేవ నుంచి మినహాయింపుల విషయంలో ఐసెన్‌కోట్‌తో విభేదాలున్నాయి. వీరి మద్దతు కోసం రాజీపడితే అరబ్ పార్టీల సహకారం కోల్పోయే ప్రమాదముంది.

జాతీయ అత్యవసర ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ఐసెన్‌కోట్ ప్రకటించారు.

ఇందుకోసం సంప్రదాయానికి భిన్నమైన ప్రయత్నాలు చేస్తానని, పార్టీలన్నీ దేశ ప్రయోజనాల కోసం రాజీపడాలని కోరారు.

ఆయన విఫలమైతే మరో సభ్యుడికి 28 రోజుల అవకాశముంటుంది.

అదీ ఫలించకపోతే 61 మంది మద్దతుతో ప్రతిపాదించిన అభ్యర్థికి 14 రోజుల గడువు లభిస్తుంది.

అన్ని ప్రయత్నాలూ విఫలమైతే పార్లమెంట్ రద్దై ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశముంది.

ADVERTISEMENT