Israel Hamas war: గాజా ఆసుపత్రుల నుంచి శిశువులను తరలించేందుకు మేం సిద్ధం: ఇజ్రాయెల్
గాజా వేదికగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. గాజలోని ఆస్పత్రులలో సమీపంలో కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇద్దరు నవజాత శిశువులు మరణించినట్లు, డజన్ల కొద్ది చిన్నారులు గాయపడినటలు పాలస్తీనా అధికారులు వెల్లడించారు. దీంతో గాజాలోని అతి ఆరోగ్య సముదాయమైన అల్-షిఫా ఆసుపత్రి నుంచి శిశువులను తరలించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ దళాలు ఆదివారం శిశువులను తరలించడంలో సహాయపడతాయని ఆర్మీ అధికార ప్రతినిధి ధృవీకరించారు. తాము ఆసుపత్రులను టార్గెట్ చేయడం లేదని సైన్యం స్పష్టం చేసింది.
హమాస్‌ను నిర్మూలించి బందీలను తిరిగి తీసుకొస్తాం: ఇజ్రాయెల్ ప్రధాని
ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య యద్ధం 6వ వారానికి చేరుకుంది. ఈ క్రమంలో గాజాలో కాల్పుల విరమణ చేయాలని ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. కానీ అంతర్జాతీయ పిలుపులను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మళ్లీ తిరస్కరించారు. గాజాలో హమాస్‌ను అణిచివేసేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గాజాలో మిలిటెంట్ల వద్ద ఉన్న మొత్తం 239 మంది బందీలను విడుదల చేస్తేనే కాల్పుల విరమణ సాధ్యమవుతుందని బెంజమిన్ అన్నారు. తాము హమాస్‌ను నిర్మూలించి బందీలను తిరిగి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, గాజాలోని అల్-షిఫా ఆసుపత్రితో తమ సంబంధాలను పూర్తిగా కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.